త్వరలో సంచార వైద్య బృందాల ఏర్పాటు
Published Sun, Sep 11 2016 12:33 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
ఉంగుటూరు : జిల్లాలో పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు సంచార వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి తెలిపారు. శనివారం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక కేంద్రంలో రోగుల రాకపోకలు, రక్త పరీక్షలు, గర్భిణులకు పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 48 మండలాలు ఉండగా ప్రస్తుతం 32 మండలాలకే సంచార వాహనాలు సమకూరాయన్నారు. ప్రతి బృందంలో ఇద్దరు వైద్యులు ఉంటారన్నారు. ఈ బృందం వారు 6 నెలల నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరిపి వారిలో లోపాలను గుర్తిస్తారన్నారు. వైద్య శాఖ, విద్యాశాఖ సమన్వయంతో ఆ బృందాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రజలకు సూచించారు. దోమల వల్ల డెంగీ వచ్చే పరిస్థితి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. మాతృ,శిశు మరణాలు తగ్గించేందుకు ప్రధానమంత్రి మాతృ అభియాన్ ద్వారా ప్రతి నెల 9వ తేదీ నుంచి 4 నెలల నుంచి 9 నెలల గర్భిణులకు వైద్య పరీక్షలను వైద్యులే చేస్తారన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసావాలపై గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకువస్తున్నామని ఆమె వివరించారు.
Advertisement
Advertisement