* అతి త్వరలో మరో 25 రాక
* ఆర్‌ఎం శ్రీహరి వెల్లడి
గుంటూరు (పట్నంబజారు): నగర వాసుల కల నెరవేరింది. ఎట్టకేలకు నగరంలో మినీ సిటీ బస్సులు రోడ్డెక్కాయి. నగరంలో నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా తిరుమల నుంచి తెప్పించిన సప్తగిరి బస్సులను ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం శ్రీహరి మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు తిప్పటంపై దృష్టి సారించామన్నారు. ఐదు సప్తగిరి బస్సులు గుంటూరుకు వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం సమయంలో కూడా విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. దూరప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చిన ప్రయాణికులు రిజర్వేషన్ టిక్కెట్‌తో నగరంలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఐదు బస్సులు వచ్చాయని, అతి త్వరలో మరో 25 వస్తాయని వివరించారు.
బస్సులు రాకపోకలు సాగించే రూట్లు ఇవీ..
1) ఎస్వీఎన్ కాలనీ, బృందావన్ గార్డెన్స్, హాలీవుడ్ జంక్షన్, మార్కెట్, గుంటూరు బస్టాండ్, గోల్డెన్ కంపెనీ, ఆటోనగర్, పెదకాకాని, పెదకాకాని ఆలయం వరకు తిరుగుతాయి.
2) గుంటూరు బస్టాండ్ నుంచి మార్కెట్, కొరిటిపాడు, విద్యానగర్, విజ్ఞాన్‌నిరుల, పెద పలకలూరు, చిన పలకలూరు, పేరేచర్ల వరకు తిరుగుతుంది.
3) ఆర్టీసీ బస్టాండ్, సంగడి గుంట, బైపాస్, సెయింట్ మేరీస్ ఉమెన్స్ కళాశాల, కారంమిల్లు, నారాకోడూరు, వేజెండ్ల అడ్డరోడ్డు, వేజెండ్ల, సుద్దపల్లి వరకు తిరుగుతుంది.
4) బస్టాండ్ నుంచి పాతగుంటూరు యాదవ కళాశాల, సుద్దపల్లి డొంక ప్రధాన రహదారి, నల్లచెరువు, శ్రీనివాసరావుపేట, ఐటీసీ, గుంటూరు మార్కెట్ మీదుగా బస్టాండ్‌కు చేరుకుంటుంది.