
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీ మహేష్ భగవత్, చిత్రంలో నిందితుడు సత్యనారాయణ
సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఓ ఎలక్ట్రిషియన్ ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు.
నాగోలు: సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఓ ఎలక్ట్రిషియన్ ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 26 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ వివరాలను తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం దేవగుప్తాం పంచాయతీ నల్లగుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ అలియాస్ సత్తిపండు(28) వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్.
గతంలో అమలాపురంలో ఓ దొంగతనం కేసులో 2003లో జైలుకు వెళ్లి వచ్చాడు. దాంతో అతడి మకాం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం సత్తెనపల్లి గ్రామానికి మార్చాడు. భార్యతో కలిసి ఉంటూ ప్రతి రోజూ నగరానికి బస్సులో వచ్చి వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను పాత తాళం చెవితో చోరీ చేసేవాడు. ఈ క్రమంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 17, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 4, విజయవాడలో 4, నల్లగొండ పోలీస్‌స్టేషన్ ల పరిధిలో 1 బైకు చోరీ కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కుకాలనీ వద్ద సోమవారం సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన ద్విచక్రవాహనాల వివరాలను సేకరించారు. చోరీ చేసిన బైకులన్నీ తన ఇంటి సమీపంలో పార్కు చేయడం విశేషం. 26 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీలు వేణుగోపాల్‌రావు, రాములునాయక్, క్రైం ఓఎస్‌డీ నాగరాజు, సీఐ మోహ¯ŒSరెడ్డి, ఎస్‌ఐ దేవేందర్, సురేందర్ పాల్గొన్నారు.
రివార్డులు...
ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసిన సీఐ మోహన్ రెడ్డిని అభినందించగా ఎస్‌ఐలు దేవేందర్, సురేందర్, హెడ్‌కానిస్టేబుల్ శంకర్, పీసీ ఆనంద్, కృష్ణారెడ్డిలను సీపీ మహేష్ భగవత్ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.