అదుపు తప్పిన స్కూల్ బస్సు
త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అతి వేగంతో స్కూల్‌బస్సు అదుపు తప్పగా.. రోడ్డు పక్కన చెట్లు ప్రమాద తీవ్రతను తగ్గించాయి.
- పక్కనే చెట్లు ఉండటంతో తగ్గిన ప్రమాద తీవ్రత
- గాయాలతో బయటపడిన విద్యార్థులు
కృష్ణగిరి: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అతి వేగంతో స్కూల్‌బస్సు అదుపు తప్పగా.. రోడ్డు పక్కన చెట్లు ప్రమాద తీవ్రతను తగ్గించాయి. చెట్లు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడేది. డోన్ పట్టణనికి చెందిన నవభారత్ ఎడ్యూకేషనల్ సోసైటీ పాఠశాలకు చెందిన మినీ బస్సు గురువారం ఉదయం అమకతాడు గ్రామం నుంచి 20 విద్యార్థులతో బయలుదేరింది. గ్రామం నుంచి రెండు కిలో మీటర్ల దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపు తప్పింది. రహదారి పక్కన చెట్లు ఉండటంతో బస్సు చెట్లను ఢీకొని వేగం తగ్గి ఓ పక్కకు ఒరిగింది. అక్కడ గుంత ఉండటం, బస్సు గుంతలో పడకుండా విరిగిన చెట్లు అడ్డుపడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి వినోద్‌కుమార్ చెయ్యి విరిగింది. మగ్బుల్‌బాషా, అసీనా, రఫీకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, వెల్దుర్తి ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్, కృష్ణగిరి ఏఎస్‌ఐ హరినాథసింగ్ çఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. గాయపడిన విద్యార్థులను డోన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డ్రైవర్ రాంప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.