1న విద్యాసంస్థల బంద్
1న విద్యాసంస్థల బంద్
Published Wed, Jul 27 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
ఏలూరు సిటీ : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వచ్చేనెల 1న విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ తెలిపారు. స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.క్రాంతిబాబు, వి.మహేష్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను మూసివేయాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు, వసతి గృహాలను మూసివేయడం అన్యాయమన్నారు. ప్రై వేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతుందన్నారు.
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ విద్య వ్యాపారులకు వత్తాసు పలుకుతుందని ధ్వజమెత్తారు. ఇంజినీరింగ్ ఫీజులను మాత్రం భారీగా పెంచిన ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచేందుకు ఆసక్తి చూపకపోవటం దారుణమన్నారు. బంద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో సంఘాలు సంయుక్తంగా ఐక్యకార్యాచరణకు పిలుపునిచ్చాయన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ బంద్‌కు ప్రై వేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు సహకరించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా నాయకులు పిల్లి తులసి, కె.అనిల్, పి.సాయికృష్ణ, మోకా శివరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement