టెక్నాలజీని శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలి
నంద్యాలరూరల్: వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని సమష్టి కృషితో పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయిలో నూతన వంగడాల సృష్టికర్తలుగా రాణించాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ బి.గోపాల్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆర్‌ఏఆర్‌ఎస్ డాక్టర్ వైఎస్సార్ సెంటనరీ హాల్‌లో మహానంది వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, ఆర్‌ఏఆర్‌ఎస్ వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంయుక్త సమావేశం మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ బాలగురువయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏడీఆర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అంతర్జాతీయ స్థాయిలో నూతన వంగడాల ఆవిష్కరణలో అద్భుత ప్రతిభ సాధించిందన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే మరిన్ని పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగానే రాష్ట్రంలోని ఏడు జోన్లలో ఆచార్య ఎన్‌జీరంగా యూనివర్సిటీ పరి«ధిలో నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానానికి జాతీయ ఉత్తమ అవార్డు లభించిందన్నారు. ఇటీవల జరిగిన మహానంది వ్యవసాయ కళాశాల 25వ వార్షికోత్సవం, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఆచార్య ఎన్‌జీరంగా యూనివర్సిటీ 46వ విస్తరణ, పరిశోధనల సలహా మండలి రెండు రోజుల సమావేశాలు సమష్టి కృషితో విజయవంతమయ్యాయన్నారు. తంగడంచ సీడ్ హబ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు సహకరించాలని ఏడీఆర్ కోరారు. సమావేశంలో బవనాసి కృషి విజ్ఞాన కేంద్రం ఇన్‌చార్జి డాక్టర్ వై.నరసింహులు(ఎమ్మిగనూరు), నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, మహానంది వ్యవసాయ కశాశాల ప్రొఫెసర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.