ప్రేమ జంట కోసం గోదావరిలో కొనసాగుతున్న గాలింపు
రాజోలు : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గోదావరిలో దూకి గల్లంతైన ప్రేమజంట ఆచూకీ లభించలేదు. బుధవారం బంధువులు, స్నేహితులు చించినాడ వద్ద గోదావరి వశిష్ట పారుు తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు. దిండి, రామరాజులంక, టేకిశెట్టిపాలెం, అప్పనరామునిలంక, సఖినేటిపల్లి, నరసాపురం గోదావరి ప్రాంతాల్లో గాలించారు. వారి ఆచూకీ లభించకపోవడంతో శివకోడులో విషాదఛాయలు నెలకొన్నాయి.
శివకోడుకు చెందిన కడలి నరేష్(20), గుబ్బల సాయికుమారి(20) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన సాయికుమారిని పెళ్లి చేసుకుంటానని నరేష్ చెప్పడంతో పెద్దలు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన నరేష్, సాయికుమారి చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోదావరిలో రెండు పడవలతో మత్స్యకారులు గాలిస్తుండగా, గోదావరి తీరంలో బంధువులు, స్నేహితులు గాలింపు కొనసాగిస్తున్నారు.