విద్యార్థులను కాపాడిన సీటు బెల్టు
విద్యార్థులను కాపాడిన సీటు బెల్టు
Published Wed, Nov 16 2016 8:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
' కేఎల్‌యూ వద్ద కారు అదుపు తప్పి బోల్తా
' ఐదుగురికి గాయాలు .. ఒకరి పరిస్థితి విషమం
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుంటుంబంలోని అన్నదమ్ముల పిల్లలు. ఇందులో ఒక యువకుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం యూనివర్సిటీని చూద్దామని వచ్చి ప్రమాదానికి గురయ్యారు. కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు సీటు బెల్టు పెట్టుకోవడంతో చిన్న చిన్న గాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకోని ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం... జయసూర్య కేఎల్‌యూలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. పెదనాన్న కొడుకు మణికంఠ పుట్టిన రోజు కావడంతో సోదరిలు లక్ష్మీ తులసి, జయదుర్గ, మోహనకుమారిలను తీసుకుని ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్నారు. అనంతరం జయసూర్య కాలేజీ చూడాలని సోదరిలు కోరడంతో మణికంఠ కారులో బయలు దేరారు. బకింగ్‌హామ్ కరకట్టపై వడ్డేశ్వరం వద్ద మూడు స్తంభాల సెంటర్‌కు వచ్చే సరికి పంట పొలాల నుంచి ఓ శునకం పరిగెత్తుకుంటూ రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి, కరకట్ట కిందకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న మణికంఠకు స్వల్పగాయాలు కాగా, పొట్టకు స్టీరింగ్ ఒత్తుకు పోవడంతో చిన్నపాటి సర్జరీ నిర్వహించారు. అయితే జయసూర్య సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తలకు తీవ్ర గాయమై చెవుల వెంట, ముక్కు వెంట రక్తం రావడంతో తలకు బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కాగా, లక్ష్మీ తులసి, మోహనకుమారిలు సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. జయదుర్గ వీరి మధ్య కూర్చోవడంతో కారు బోల్తా పడినప్పుడు ఎడమ కాలు విరిగింది. సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే ఒకరిపై ఒకరు పడకుండా ప్రమాదం తప్పిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను చూసైనా ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని, టూ వీలర్‌పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని మంగళగిరి రూరల్ సీఐ సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు.
Advertisement