
సెల్ఫీ కష్టాల్లో మావోయిస్టు అగ్రనేత
విశాఖపట్నం: చిన్నా పెద్దా అందరికీ సెల్ఫీ ల మోజు సామాన్యమైంది కాదు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సెల్ఫీ వివాదంలో ఓ మావోయిస్ట్ అగ్రనేత చిక్కుకోవడంతో వైజాగ్ రూరల్ పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. అవును...చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఉనికి ఇపుడు ప్రమాదంలో పడింది. చలపతి ఆచూకీ లభ్యం కాక ..కనీసం అతని ఫోటో కూడా దొరకక తలపట్టుకున్న పోలీసులకు .. అతను భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ లభ్యం కావడం ఆసక్తకరంగా మారింది.
మావోయిస్టు నేత, కోరాపూట్- శ్రీకాకుళం డివిజన్ కమిటీ డిప్యూటీ కమాండర్, మోస్ట్ వాంటెడ్ చలపతి అలియాస్ అప్పారావు, అతని భార్య అరుణఫోటో పోలీసులకు చిక్కింది. దీంతో ఇదే అదునుగా భావించిన అధికారులు ఏజెన్సీ ఏరియాల్లో పోస్టర్లు అతికించడం కలకలం రేపింది.
అయితే ఏడాది మే14న జరిగిన ఎన్ కౌంటర్ లో అరుణ సోదరుడు, మావోయిస్ట్ అజాద్ సహా, మరోఇద్దర్ని పోలీసులు కాల్చిచంపారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో ఆయుధాలు, కిట్ బ్యాగులు,ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చలపలి సెల్ఫీ ఫోటోను సేకరించారు పోలీసులు. వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల తూర్పు డివిజన్ కార్యదర్శి కూడా అయిన చలపతిపై 20 లక్షల రివార్డు ఉండగా, అరుణపై 5 లక్షల రివార్డు ఉంది.
ఎప్పుడో 90ల్లో దిగిన సరిగా కనిపించని ఫొటోతోనే ఇన్నాళ్లూ పోలీసులు చలపతి కోసం గాలించారు. కానీ ఇప్పుడు ఏకంగా అతడే ఇలా సెల్ఫీతో తన ఆనవాళ్లు అందించడంతో తమ పని సులువైందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత సెల్ఫీని లాప్‌టాప్‌లో దాచుకోవడం వాళ్లు చేసిన పెద్ద పొరపాటని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోటోల సహాయంతో చలపతి ని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లు, సెల్ఫీ వార్తలపై అటు మావోయిస్టు వర్గాలనుంచి గానీ, ఇతర విప్లవ పార్టీలనుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.