ఆగని... ‘కాల్’నాగులు
- రామచంద్రాపురంలో మహిళకు లైంగిక వేధింపులు
- రూ.కోటిన్నర విలువ చేసే స్థలం తనఖా
- రూ.2లక్షలకు ఐదేళ్లకే రూ.40 లక్షలు కట్టాలని ఒత్తిడి
- హైకోర్టు ఆదేశంతో కేసు నమోదు చేసిన పోలీసులు
రామచంద్రపురం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం సద్దుమణగలేదు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో తాజాగా వెలుగు చూసిన కాల్‌నాగుల విష పన్నాగమే ఇందుకు నిదర్శనం. అధిక వడ్డీలు వేసి, ఇచ్చిన 2 లక్షలకు 40 లక్షలు కట్టకపోతే రూ.కోటిన్నర విలువైన స్థలం స్వాధీ నం చేసుకుంటామని బెదిరించారు. లొంగలేదని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని న్యాయం చేయాలంటూ బాధిత మహిళ హైకోర్టు తలుపు తట్టిం ది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రామచంద్రపురం పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో 2010లో కుతుకులూరుకు చెందిన నల్లమిల్లి వీర్రెడ్డి నుంచి ఆమె రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. ఇందుకోసం కత్తిపూడిలో ఉన్న రూ.కోటిన్నర చేసే స్థలం తనఖా పెట్టుకోవడంతో పాటు 10 ఖాళీ చెక్కులు, 10 ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు కూడా తీసుకున్నారు. 2010 జూన్‌లో అస్వాధీన తనఖా కాకుండా కాగితాలను మార్చి పవర్ ఆఫ్ పట్టాగా రాయించుకున్నారు. దీనిపై అడగ్గా ఎటువంటి సమస్యా ఉండదని వీర్రెడ్డి నమ్మబలికారు. నెలనెలా వడ్డీలు కడుతున్నా, రూ.40 లక్షలు వెంటనే కట్టాలని, లేకుంటే స్థలం స్వాధీనం చేసుకుని, వేరేవారికి అమ్ముతామంటూ బెదిరించడం మొదలు పెట్టారు.
వీర్రెడ్డితో పాటు సత్తి శ్రీనివాసరెడ్డి, పులగం వీఆర్‌జీ కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి జనార్దనరెడ్డి బాధితురాలిని, ఆమె తండ్రిని వేధించడం ప్రారంభించారన్నారు.వారి నుంచి బయటపడేందుకు విశాఖ జిల్లా గాజువాకలో ఉన్న ఇం టిపై అప్పు తీసుకుని సెటిల్‌మెంట్‌కు వెళ్లగా రూ.12 లక్షలు తీసుకుని కొన్ని కాగితాలు మాత్రమే ఇచ్చారన్నారు. తర్వాత మిగిలిన కాగితాలు ఇస్తామని చెప్పి సోమేశ్వరం గ్రామ శివార్లలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్లు వద్దకు పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి యత్నించి వీడియో తీశారని, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరకు హైకోర్టును ఆశ్రయించానని వివరించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు రామచంద్రపురం ఎస్సై ఎల్.శ్రీనునాయక్ తెలిపారు.