ముత్తిరెడ్డికి షాక్‌ | shock to MLA Mutthireddy Yadagiri reddy | Sakshi
Sakshi News home page

ముత్తిరెడ్డికి షాక్‌

Published Sat, Sep 10 2016 11:55 PM | Last Updated on Tue, Oct 30 2018 5:26 PM

ముత్తిరెడ్డికి షాక్‌ - Sakshi

ముత్తిరెడ్డికి షాక్‌

  • ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి
  • రెండు స్థానాలు విపక్షాలకే..
  • చెరొక స్థానాన్ని గెలచుకున్న కాంగ్రెస్, సీపీఎం
  • జనగామ ఎమ్మెల్యేకు ఇబ్బందికర ఫలితాలు
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. జనగామ నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు 8న ఉప ఎన్నికలు నిర్వహించింది. ఇదే రోజు జనగామ మండలం మరిగడి, బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్, సీపీఎం చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. రెండు ఎంపీటీసీ ఎన్నికలే అయినా... రాజకీయ పార్టీల గుర్తుపై జరిగినవి కావడంతో ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈ ఫలితాలు ప్రస్తుత తరుణంలో మరింత ఇబ్బందులు పెంచే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
     
     జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జనగామలో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశించిన మేరకు స్పందించలేదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. జిల్లా ఏర్పాటుపై ముందుగా దూకుడుగా వెళ్లి, తర్వాత ప్రభుత్వ స్థాయిలో సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు సాధన సమితి వరుసగా నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాలతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ బంద్‌ నిర్వహించిన రోజు పలువురు ఉద్యమకారులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామం తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గిందని టీఆర్‌ఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియతో సొంత పార్టీలోనూ ముత్తిరెడ్డికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
     
    జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో భువనగిరి లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌తో ముత్తిరెడ్డికి విభేదాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన జిల్లాల పునర్విభజన ముసాయిదాలో జనగామ జిల్లా ప్రస్తావన లేదు. అప్పటి నుంచి ముత్తిరెడ్డికి జనగామ నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పెరిగాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ముత్తిరెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారాయి. 
     
     – జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి డి.సిద్ధయ్య విజయం సాధించారు. సిద్ధయ్యకు 963 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కళింగరాజుకు 710, సీపీఎం అభ్యర్థి బి.వెంకటరాజుకు 512, టీడీపీ అబ్యర్థి అశోక్‌కు 166, నోటాకు 28 ఓట్లు వచ్చాయి. 
     
    – బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎం.డి.మహబూబ్‌ విజయం సాధించారు. మహబూబ్‌కు 633 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పి.ఐలమ్మకు 519, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఐలమ్మ పోటీ చేశారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement