ఎస్‌పీవై రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ | Shock to spy reddy in high court | Sakshi
Sakshi News home page

ఎస్‌పీవై రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Published Wed, Dec 16 2015 7:53 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఎస్‌పీవై రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ - Sakshi

ఎస్‌పీవై రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

♦ నిర్దేశిత గడువులోపు ఉత్పత్తి చేపట్టకపోవడం మీ తప్పిదం
♦ తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చారు
♦ జీవో 67 ప్రకారమే లెసైన్స్ ఫీజు చెల్లించండి
♦ ఎల్‌ఓఐ జారీ తేదీ నాటి ఫీజునే చెల్లిస్తామంటే కుదరదు
♦ చెల్లించిన రూ.17 కోట్లు కాక, మరో రూ.34 కోట్లు కట్టండి
♦ స్వీయతప్పిదాలతో లబ్ధి పొందుదామనుకుంటే చూస్తూ ఊరుకోం
♦ ఐఎంఎఫ్‌ఎల్ డిస్టలరీ ఏర్పాటు కేసులో ఎస్‌పీవై రెడ్డికి హైకోర్టు ఆదేశం
♦ కొడాలి నానిపై ఎస్‌పీవై ఆరోపణలను పరిగణనలోకి తీసుకోని ధర్మాసనం
♦ ఎల్‌ఓఐ కాలవ్యవధి పొడిగింపు విషయంలో సర్కారు తీరు సరికాదని స్పష్టీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్‌పీ వై రెడ్డికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా, ఉడుములపురం వద్ద ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుమీద తాను ఏర్పాటు చేయదలచిన దేశీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్) ఉత్పత్తి డిస్టలరీ ఏర్పాటు లెసైన్స్‌కోసం 2009 నాటి పాత జీవో ప్రకారం కాకుండా 2011లో జారీ చేసిన జీవో 67 ప్రకారమే లెసైన్స్ ఫీజును చెల్లించాలని హైకోర్టు తేల్చిచెప్పింది. 2009లో అప్పటి జీవో ప్రకారం ఇప్పటికే చెల్లించిన రూ.17 కోట్లు కాక, 2011 నాటి కొత్త జీవో ప్రకారం మిగిలిన రూ.34 కోట్లను కూడా చెల్లిం చి తీరాల్సిందేనని స్పష్టంచేసింది.

తను చేసిన స్వీయతప్పిదాల ద్వారా లబ్ధి పొందాలని ఎస్‌పీవై చూస్తే.. అందుకు తాము అనుమతించబోమని తెలిపింది. నిబంధనల మేరకు నిర్దేశించిన గడువులోపు మద్యం పరిశ్రమ నిర్మాణ పనుల్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించకపోవడం ఎస్‌పీవై తప్పిదమంది. ఈ తప్పిదం ద్వారా ఖజానాకు ఎస్‌పీవై భారీ నష్టం కలిగించారని ఆక్షేపించింది. ఎల్‌ఓఐ జారీ చేసిన నాటికున్న నిబంధనల మేరకే లెసైన్స్‌ఫీజు చెల్లిస్తానన్న ఎస్‌పీవై వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. 2013లో మళ్లీ లెసైన్స్‌కోసం దరఖాస్తు చేసుకునే నాటికే కొత్త జీవో 67 జారీ అయిందని, కాబట్టి దానిప్రకారమే లెసైన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

అంతేకాక రాజకీయ దురుద్దేశాలతోనే కొడాలి నాని ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్న ఎస్‌పీవై వాదనల్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మేరకు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2008లో ఎస్‌పీవైకి జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెట్(ఎల్‌ఓఐ) గడువు 2011లో ముగిసిం దని, అయితే ప్రభుత్వం మళ్లీ దాన్ని ఎప్పటికప్పుడు 2015 వరకు పొడిగిస్తూ వెళ్లిందని, ఇది ఏపీ మద్యం నిబంధనలకు విరుద్ధమంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 27న తీర్పును వెలువరించింది. అయితే తీర్పు కాపీ మాత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది. తీర్పు ముఖ్యపాఠం ఇలా ఉంది.

 2011 నుంచి 2013 వరకు ఎల్‌ఓఐ మనుగడలోనే లేదు...
 రాష్ట్రప్రభుత్వం మూడేళ్ల కాలవ్యవధితో ఎస్‌పీవైకి 2008లో ఎల్‌ఓఐ జారీ చేసింది. అలాగే లెసైన్స్‌కోసం 2009లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య కేవలం ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయే తప్ప, 2013 వరకు ఎటువంటి పురోగతీ లేదు. లెసైన్స్‌కోసం 2009లో దరఖాస్తు చేసుకున్నప్పుడు, మళ్లీ 2013లో ఎందుకు దరఖాస్తు చేసుకున్నారన్న మా ప్రశ్నకు ఎస్‌పీవై సంతృప్తికరమైన సమాధానమివ్వలేదు. అలాగే రాష్ట్రప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేదు.

ప్రస్తుత కేసులో అక్టోబర్ 5, 2013న లెసైన్స్‌కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ వెంటనే దానిని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2011, అక్టోబర్ 20(ఎల్‌ఓఐ మూడేళ్ల గడువు ముగిసిన తేదీ) నుంచి 2013, ఏప్రిల్ 17(ఎల్‌ఓఐని పొడిగించిన తేదీ) వరకు అంటే మొదటి పొడిగింపు వచ్చేంతదాక రెండేళ్లపాటు ఎల్‌ఓఐ మనుగడలోనే లేదు. రెండేళ్లపాటు మనుగడలో లేని ఎల్‌ఓఐకి 2013లో పొడిగింపు రావడమే ఎస్‌పీవై మరోసారి లెసైస్స్‌కోసం దరఖాస్తు చేసుకో వడానికి ప్రధాన కారణమని తేటతెల్లమవుతోంది. అంతేగాక ఎల్‌ఓఐ పొడిగింపును ఎస్‌పీవై.. పొడిగింపుగా భావించలేదు. తాజా ఎల్‌ఓఐ జారీగా చేసినట్లే భావించారు. ఇది కూడా లెసైన్స్‌కోసం మళ్లీ దరఖాస్తు చేయడానికి ప్రధాన కారణమని మాకు అర్థమవుతోంది.

 అప్పటికే లెసైన్స్ రేట్ల సవరణ జరిగింది
 ప్రస్తుత కేసులో జీవో 90 ప్రకారం ఎస్‌పీవైకి 2008లో ఎల్‌ఓఐ ఇచ్చారు. ఆ తరువాత జీవో 90కి పలు సవరణలు జరిగాయి. 2013లో మళ్లీ దరఖాస్తు చేసుకునే నాటికే లెసైన్స్ ఫీజు నిబంధనలకు పలు సవరణలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మా అభిప్రాయం ప్రకారం లెసైన్స్‌కో సం ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారనేదిగాక.. దానిని ఎప్పుడు పరిగణనలోకి తీసుకున్నా రన్నదే ముఖ్యం. కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లెసైన్స్ ఫీజు విషయంలో ఎల్‌ఓఐ జారీ చేసిన తేదీ అంత ము ఖ్యం కానేకాదు. జీవో 90లో నిర్దేశించిన నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాల్సిన విధివిధానాలను ఎస్‌పీవై పూర్తి చేయలేదు.

నిర్దిష్ట గడువులోపు లెసైన్స్ పొందడంగానీ, ఉత్పత్తి ప్రారంభించడంగానీ చేయలేదు. ఎల్‌ఓఐ ప్రకారం పరిశ్రమ నిర్మాణాలను పూర్తి చేయలేదు. కాబ ట్టి ఎస్‌పీవై 2013లో మళ్లీ దరఖాస్తు చేసుకునే నాటికి ఉన్న లెసైన్స్ ఫీజును చెల్లించాలి తప్ప, ఎల్‌ఓఐ జారీ నాటికి ఉన్న ఫీజులను చెల్లిస్తామంటే కుదరదు. లెసైన్స్ ఫీజు కింద ఇప్పటికే కొంత ఫీజును చెల్లించి ఉన్నందున, కొత్త జీవో ప్రకారం మిగిలిన ఫీజును చెల్లించాలి.
 
 రాష్ట్రం అనుసరించిన విధానం సరికాదు..
 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారన్నది ముఖ్యం కాదు.. ఆ దరఖాస్తును ఎప్పుడు పరిగణనలోకి తీసుకున్నారన్నదే ముఖ్యం. ఈ కేసులో కూడా లెసైన్స్‌కోసం దరఖాస్తు ఎప్పుడు పెట్టుకున్నారనేది గాక.. దానిని ఎప్పుడు పరిగణనలోకి తీసుకున్నారన్నదే ప్రధానం. ఎస్‌పీవై 2013లో పెట్టుకున్న దరఖాస్తును ఓసారి పరిశీలిస్తే, 2009లో చేసుకున్న దరఖాస్తుకు, దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. తాజా దరఖాస్తులో నిబంధనల మేరకు లెసైన్స్ ఫీజును చెల్లించడంతోపాటు ఇతర విధివిధానాలను తూచా తప్పకుండా పాటిస్తామని హామీఇచ్చారు.

నిబంధనల మేరకు నిర్దేశించిన గడువులోపే లెసైన్స్‌కోసం దరఖాస్తు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఎల్‌ఓఐ పొడిగింపును పొడిగింపుగా కాకుండా తాజా ఎల్‌ఓఐ జారీగా పరిగణించడం వల్లే నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేసుకుంటున్నామన్న విషయాన్ని తాజా దరఖాస్తులో పొందుపరిచారు. ఈ పరిస్థితుల్లో గతంలో ఎ ప్పుడో ముగిసిన ఎల్‌ఓఐ కాలవ్యవధిని మళ్లీ పొడిగించే విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరించిన విధానం ఎంతమాత్రం సరికాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement