మద్యం షాఫుల్‌! | Shops early in contrast to the rules | Sakshi
Sakshi News home page

మద్యం షాఫుల్‌!

Published Thu, Aug 24 2017 3:15 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

మద్యం షాఫుల్‌!

మద్యం షాఫుల్‌!

వైన్‌షాపుల వద్ద బహిరంగంగా తాగి ఊగుతున్న మందుబాబులు
ఆ మైకంలో విపరీతంగా దాడులు
ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు
గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న బెల్టుషాపులు
నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే షాపులు తెరుస్తున్న వైనం
మొదట్లో హడావుడి ..తరువాత పట్టించుకోని యంత్రాంగం


రైల్వేకోడూరులో వైన్‌షాపుల వద్ద ఆదివారం అయితే చాలు జాతర వాతావరణం ఉంటోంది. ఏదో విందుకు వచ్చిన వారి మాదిరిగా వరుసగా రోడ్డుపక్కనే, రోడ్డుపైన మందుబాబులు కొలువుదీరుతున్నారు. ఆ వైపు ఎవరైనా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
గత ఆదివారం రాత్రి కడప ట్రంకురోడ్డులో వెళుతున్న ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సుపై ముగ్గురు మందుబాబులు మద్యం మత్తులో రాళ్లతో దాడి చేశారు. ఎదురుతిరిగిన ప్రయాణికులు, డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులపైనా వారు తిరగబడ్డారు.
మద్యం షాపుల వద్ద మందుబాబుల వ్యవహారం విచ్చలవిడిగా మారింది. ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. రోజూ ఏదో ఒకచోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మందుబాబుల ఆగడాలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. అయినా అరికట్టే చర్యలు మాత్రం శూన్యం.

కడప: జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. మంచినీరు దొరుకుతుందో లేదో చెప్పలేం కానీ మద్యం మాత్రం ఎక్కడపడితే అక్కడ.. ఏ సమయంలోనైనా సరే అందుబాటులో ఉంటోంది. నగరం, గ్రామం అని తేడా లేదు. మద్యం మాత్రం పుష్కలం. టార్గెట్లు పెట్టి మరీ అధికారులు మద్యం అమ్మిస్తున్నారని స్వయంగా దుకాణదారులే చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా మందుబాబుల హడావుడి ఎక్కువైంది. రోడ్లపక్కన, జనావాసాల మధ్య ఉన్న వైన్‌షాపుల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ కూర్చుని మందుబాబులు సురాపానంలో మునిగి తేలుతున్నారు. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా.. మారుమూల గ్రామాల్లోని కొన్ని చిల్లరదుకాణాల్లో మద్యాన్ని రహస్యంగా విక్రయిస్తున్నారని తెలిసింది. ఒకరికి రెండు బాటిళ్లు అన్న నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండటంతో వివాదాలు, ఘర్షణలు, నేరాలు పెరిగిపోయాయి. గత నెలరోజుల్లోనే విపరీతంగా క్రైం రేటు ఎక్కువైంది.

రోడ్లపైనే సిట్టింగ్‌లు..
అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని బెల్టుషాపులన్నింటినీ రద్దుచేస్తామని చంద్రబాబు చెప్పినా.. ఈనాటికీ అది రూపుదాల్చలేదు.. అయితే మూడేళ్ల తరువాత మేల్కొన్న సర్కారు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో బెల్టుషాపులన్నీ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీల వ్యవహారంతోపాటు బెల్టుషాపుల రద్దుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. అనేకచోట్ల షాపుల ఏర్పాటు విషయంలోనే ప్రజా తిరుగుబాటు వచ్చినా..మందుబాబుల వీరంగాలు మాత్రం తగ్గడం లేదు. పైగా కొంతమంది తాగుబోతులు ఏకంగా షాపుల ఎదుటనే తాగుతూ దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.

తాగరా..తాగి ఊగరా..
నిబంధనల ప్రకారం వైన్‌షాపులో మందు కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్మిట్‌ రూములోకి వెళ్లి మాత్రమే తాగాలి. కాని కొంతమంది షాపు బయటనే కూర్చుని తాగుతుండటం, రోడ్లపైనే సిట్టింగ్‌లు ఎక్కువయ్యాయి. బహిరంగంగా మందు తాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.మద్యం షాపుల వద్దనే విచ్చలవిడిగా తాగుతూ ఊగుతున్నా అడిగే అధికారులు లేకపోవడం విశేషం.

ఆ వైపు వెళ్లాలంటేనే మహిళలు వణికిపోతున్నారు.  మందుషాపు ఉన్న ప్రాంతమంతా కూడా మందుబాబులతో హడావుడి ఉంటుండటంతో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎవరైనా స్థానికులు ఇదేంటని ప్రశ్నించడానికి సైతం జంకుతున్నారు. వైన్‌షాపుల వద్ద బయట పరిస్థితి అంతా జాతరను తలపిస్తోంది. తాగిన మత్తులో వాళ్లు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

బెల్టుషాపుల జోరు
జిల్లాలో మద్యంషాపులకు తోడు బెల్టుషాపులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజూ ఏదో ఒకచోట ఎక్సైజ్‌ అధికారులు బెల్టుషాపుల నిర్వాహకులను పట్టుకుంటునే ఉన్నారు. కానీ బెల్టుషాపులను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో 3,200 వరకు ఉన్న గొలుసు దుకాణాలు ఇప్పడు తగ్గిపోయాయి. కానీ అక్కడక్కడ రహస్యంగా నడుస్తూనే ఉన్నాయి. అధికారపార్టీ అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపులను కొందరు నడిపిస్తున్నారు. కొంతమంది స్థానిక అధికారుల సహకారంతోనే నడుస్తున్నాయనేది అందరికీ తెలిసిన సత్యం. బహిరంగ ప్రాంతాల్లో కాకుండా చడీచప్పుడు లేని ప్రాంతాలు వేదికగా షాపులను నిర్వహిస్తున్నారు. రాయచోటి పరిధిలో అయితే ఇప్పటికీ ఏకంగా కూల్‌డ్రింక్‌ షాపుల్లో, సాధారణ ఇళ్లలో పెట్టి మద్యం విక్రయిస్తున్నారు. పైగా అధికారుల సహకారంతోనే నడుస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement