షార్ట్‌సర్క్యూట్‌తో రెండిళ్లు దగ్ధం
-
నాలుగు కుటుంబాలు నిరాశ్రయం∙
-
రూ.4 లక్షల ఆస్తినష్టం
గొల్లప్రోలు :
చేబ్రోలులోని పల్లపువీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తినష్టం ఏర్పడి, నాలుగు కుటుంబాలు నిరాశ్రయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పక్క పక్క నున్న రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పాలపర్తి రామన్నదొర, అతడి కుమారుడు దుర్గాబాబు నివాసం ఉంటోన్న ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంటిలో ఉన్న టీవీ, ఫ్యాను, ఎలక్టిక్రల్ గృహోపకరణాలు, బియ్యం, దుస్తులు బూడిదయ్యాయి. ముందు రోజు బ్యాంకు నుంచి తీసుకొచ్చిన డ్వాక్రా రుణం రూ.30 వేలు, అప్పు తీర్చేందుకు దాచి ఉంచిన రూ.20 వేలు మొత్తం రూ.50 వేలు కాలి బూడిదయ్యాయి. వీటితో పాటు ఇంటికాగితాలు, ఆధార్, రేష¯ŒSకార్డులు కూడా కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలామని, రెక్కాడితేకానీ డొక్కాడని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
మరో ఇంటి ప్రమాదంలో...
చుట్టలు చుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న లింగం చిన్నయ్యదొర, అతడి కుమారుడు సూర్యప్రకాష్ ఉంటున్న ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. బ్యాంకులో నుంచి తీసుకొచ్చిన డ్వాక్రా రుణం రూ.50 వేలు, కూతురికి కొత్త దుస్తులు కొందామని దాచుకున్న రూ.20 వేలు కాలిపోయాయి. ఎలక్టిక్రల్, గృహోపకరణాలు, దుస్తులు, బూడిదయ్యాయి.వారు కట్టుబట్టలతో మిగిలారు.
పేలిన గ్యాస్ సిలిండర్...
అగ్నిమంటలకు చిన్నయ్యదొర ఇంటిలో ఉన్న సిలండర్ భారీ శబ్ధంతో పేలిపోయింది. పేలుడు దాటీకి సిలండర్‌లోని ఇనుప భాగాలు సుమారు వంద అడుగులు దూరంలో ఎగిసిపడ్డాయి. పేలుడు శబ్ధానికి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. పిఠాపురం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు ఇళ్లు మొత్తం కాలిపోయాయి.