హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరుగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పోలింగ్ కేంద్రం వద్ద జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, డీకే అరుణ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఇరు వర్గాల వారిని పోలింగ్ కేంద్రం వద్ద నుండి చెదరగొట్టారు.
నల్లగొండ జిల్లాలో పోటీ తీవ్రంగా ఉండటంతో పోలింగ్ రసవత్తరంగా మారింది. సుమారు 200 మంది అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్లో పాల్గొనే వారిని క్యాంపుల నుండి నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలిస్తున్నారు.