21 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు
Published Sun, Feb 19 2017 9:13 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
– అనర్హులను ఓటర్లుటగా గుర్తించడంపై హైకోర్టు సీరియస్
కర్నూలు(అగ్రికల్చర్): పట్టభద్రుల ఎన్నికల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేసినందుకుగాను హైకోర్టు ఆదేశాల మేరకు 21 మంది తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. సోమవారం వీరికి ఇవి అందనున్నాయి. వీటికి తహసీల్దార్లు వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని 21 మండలాల్లో బోగస్ పట్టభద్రులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు, టీసీలు, ఆధార్ కార్డుల ఆధారంగా.. పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. జిల్లా అధికారులందరూ నోడల్ అధికారులుగా ఉన్నారు. వీరందుకే ఓటర్ల జాబితాలో అనర్హులను గుర్తించే కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. సోమవారం సాయంత్రానికి బోగస్ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రానుంది. నామినేషన్‌ల గడువు సోమవారం నాటితో పూర్తి కానున్న విషయం విదితమే.
Advertisement
Advertisement