పెద్దయ్య చిన్న బుద్ధి!
►ఎస్పీ సిఫార్సులకంటే టీడీపీ నేత ఆదేశాల వైపే మొగ్గు
► నాలుగు నెలలుగా ఓ కుటుంబం నరకయాతన
► పోలీసుస్టేషన్‌లో అక్రమ నిర్బంధం.. బలవంతపు సంతకాలు
► మానవ హక్కుల సంఘం, హైకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ వేధింపులు
► స్పందించని ఉన్నతాధికారులు
సాక్షి ప్రతినిధి, కడప: ఆయన ఓ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ. ప్రజలకు జవాబుదారీగా, అంత్యంత బాధ్యతాయుతంగా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి. కాగా, ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు పదేపదే తప్పులు చేస్తూ వివాదాస్పదమయ్యారు. న్యాయం కోసం ఓ ప్రేమికుడు చేస్తున్న పోరాటానికి అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ఎస్పీ ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతున్నారు. ఈ అధికారి కారణంగా ఆ యువకుడి కుటుంబం నాలుగు నెలలుగా నరకయాతన అనుభవిస్తోంది. తుదకు మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన దుస్థితి కల్గింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
పెనగలూరుకు చెందిన శ్రీహరిప్రసాద్, చిట్వేలికి చెందిన నాగపద్మిని ఇద్దరూ క్లాస్‌మేట్స్. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశారు. వారిద్దరూ గత ఏడాది జూన్ 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఎస్పీని ఆశ్రయించి భద్రత కల్పించాలని కోరారు. ఆ మేరకు రాజంపేట రూరల్ సీఐ హేమసుందర్‌రావు ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత నాగపద్మిని, శ్రీహరిప్రసాద్‌లు తిరుపతిలో కాపురం పెట్టారు. మూడు నెలలు తిరుపతిలో వారి సంసార జీవితం అన్యోన్యంగా సాగింది.
తాను తన అమ్మ నాన్నలను చూడకుండా ఉండలేక పోతున్నానని, ఇంటికి వెళ్తానని నాగపద్మిని పేర్కొనడంతో.. తన నుంచి మీవాళ్లు దూరం చేస్తారని శ్రీహరిప్రసాద్ చెబుతూ వచ్చినట్లు సమాచారం. ఆ క్రమంలోనే అతను గత ఏడాది నవంబర్9న ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇతను ఓవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరోవైపు పెనగలూరు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య సహకారంతో నాగపద్మినిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం పెనగలూరు పోలీసుస్టేషన్‌లో పంచాయితీ నిర్వహించి, ఇకపై నాగపద్మినితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అమె తండ్రికి అప్పగించానని శ్రీహరిప్రసాద్‌తోనూ, నాగపద్మిని తండ్రితో సైతం లేఖ రాయించి ఇరు కుటుంబాలతో సంతకాలు చేయించారు. బలవంతంగా పోలీసుస్టేషన్‌లో చోటుచేసుకున్న పరిణామంపై శ్రీహరిప్రసాద్.. మానవ హక్కువ కమిషన్‌ను, ఆపై హైకోర్టును ఆశ్రయించారు.
ఎస్పీ ఆదేశించినా భేఖాతర్..
‘శ్రీహరిప్రసాద్‌కు అన్యాయం చేయొద్దు. చట్టపరంగా వ్యవహరించండి. వివాహాం చేసుకున్న వారితో స్టేషనలో ఎలా సంబంధం లేదని కాగితాలు రాయిస్తావు’ అంటూ జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి ఎస్‌ఐ చిన్నపెద్దయ్యపై మండిపడ్డట్లు సమాచారం. ఎస్పీకి ఫిర్యాదు చేశారనే అక్కసుతో శ్రీహరిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని లాఠీలు ఝుళింపించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సహనం కోల్పోయి, మూకుమ్మడిగా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
ఇంతగా ఏకపక్షంగా వ్యవహరించడానికి ఏకైక కారణం ఆ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత సూచనలేనని తెలుస్తోంది. ఈ విషయమై ఎస్‌ఐ చిన్నపెద్దయ్యను వివరణ కోరగా తాను బిజీగా ఉన్నానని, తర్వాత మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేశాడు. ఇదే విషయాన్ని రాజంపేట రూరల్ సీఐ హేమసుందర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా శ్రీహరిప్రసాద్ మోటార్ బైక్‌కు ఆర్‌సీ లేకపోవడంతోనే స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ విచారణ చేస్తున్నారని, అంతలోనే వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.
ఎస్‌ఐ నుంచి తీవ్రమైన వేధింపులు..
ఈ మొత్తం వ్యవహారంపై శ్రీహరిప్రసాద్ ఎప్పటికప్పుడు తనకు చోటుచేసుకున్న అన్యాయంపై స్పందిస్తూ వచ్చారు. ఉన్నతాధికారులు, మీడియా, హక్కుల సంఘాలు, న్యాయస్థానం దృష్టికి తన సమస్యను తీసుకెళ్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈక్రమంలో జనవరి 29న మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆవ ేురకు మార్చి 30లోపు విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలంటూ కమిషన్ ఎస్పీ నవీన్ గులాఠీని ఆదేశించింది.
అంతటితో ఆగకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. ఆ మేరకు విచారణకు స్వీరించిన హైకోర్టు మార్చి 25న నాగపద్మినిని హైకోర్టులో హాజరు పర్చాలని ఆదేశించింది. ఆ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా ఎస్పీ, పెనగలూరు ఎస్‌ఐ, అమె తండ్రి గోపాల్‌లను ప్రతివాదులుగా చేర్చింది. ఎస్పీ, ఎస్‌ఐలు నాగపద్మినిని హైకోర్టులో హాజరు పర్చాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.