పల్లెకు సుస్తీ! | sick village | Sakshi
Sakshi News home page

పల్లెకు సుస్తీ!

Published Thu, Sep 15 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

పల్లెకు సుస్తీ!

పల్లెకు సుస్తీ!

పీహెచ్‌సీల్లో అరకొర వైద్యం
– భారీగా వైద్యులు, సిబ్బంది ఖాళీలు
– గ్రామాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపని వైద్యులు
– ఉన్న వారిలో అధిక శాతం డుమ్మా
– డిప్యూటేషన్‌ ఆసుపత్రుల్లో దేవుడే దిక్కు
– ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యం
 
‘‘గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాం. పల్లె జనానికి ఉత్తమ వైద్య సేవలందిస్తాం.’’ వైద్య పట్టా పుచుకునే సమయంలో యువ వైద్యులు చేస్తున్న ప్రమాణం ఆ తర్వాత అపహాస్యమవుతోంది. పల్లెల్లో సేవలందించేందుకు ఏ ఒక్కరూ ముందుకురాని పరిస్థితి. ఒకవేళ్ల వచ్చినా.. పీజీ కోర్సుపైనే దృషి. ఇక యథారాజా.. తథా ప్రజ అన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తీరు ఉంటోంది. ఇలా వచ్చి.. అలా వెళ్తున్న పరిస్థితుల్లో ప్రజారోగ్యం క్షీణిస్తోంది.
 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. వీటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 40. ఇవే కాకుండా వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 20 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు పని చేస్తున్నాయి. వైద్యులు, పారామెడికల్, ఉద్యోగులతో కలిపి 2,130 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటలకు విధులకు హాజరై సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాలి. ఉద్యోగుల హాజరు నమోదుకు దాదాపు అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ మిషన్లను ఏర్పాటయ్యాయి. వీటిని సీఎం డ్యాష్‌బోర్డ్‌కు అనుసంధానించారు. ఏ సమయంలోనైనా ఎవరైనా ఏ జిల్లాలో ఎంత మంది, ఏ వేళకు హాజరయ్యారో తెలుసుకునే వీలుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే కొందరు మెడికల్‌ ఆఫీసర్లు, ఎంపీహెచ్‌ఏలు క్షేత్రస్థాయికి వెళ్లి వైద్యసేవలు అందిస్తారు. ప్రతి ఒక్కరూ పీహెచ్‌సీకి హాజరైన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లాలని అధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఉన్న ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కాకపోగా, ఖాళీలు సైతం రోగులను వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల పోస్టులు భారీగా ఖాళీ ఏర్పడ్డాయి. దీనికితోడు 24 గంటలపాటు సేవలందించే పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సు పోస్టులు సైతం భర్తీ కాని పరిస్థితి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా చేపట్టడం లేదు. పెరిగిన జనాభాకు.. ఉన్న పీహెచ్‌సీ సిబ్బందికి పొంతన ఉండటం లేదు. 15 ఏళ్ల క్రితం 75 పీహెచ్‌సీలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 83కు చేరింది. మరో ఐదు పీహెచ్‌సీలు మంజూరైనా సిబ్బందిని కేటాయించకపోవడం గమనార్హం.
 
ఉద్యోగుల హాజరు ఇలా..
ప్రతిరోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధుల్లో ఉండాలి.   వీరు వచ్చేటప్పుడు ఉదయం 9.30 గంటల్లోగా, సాయంత్రం వెళ్లేటప్పుడు 4.30 గంటల్లోగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవాలి. జిల్లాలో మొత్తం 2,130 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో గురువారం 2,041 మంది హాజరయ్యారు. 9 గంటల్లోపు కేవలం 908 మంది మాత్రమే హాజరైనట్లు సీఎం డ్యాష్‌బోర్డు చూపుతోంది. గురువారం బయోమెట్రిక్‌ నివేదిక ప్రకారం ఉదయం 9 గంటల్లోపు 22 శాతం, 9 నుంచి 9.30 గంటల వరకు 25 శాతం, 9.30 నుంచి 10 గంటల్లోపు 18 శాతం, మిగిలిన వారు 10 తర్వాత హాజరయ్యారు. అంటే నిర్ణీత సమయంలోపు 72 శాతం ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.
 
ఉద్యోగులపై పర్యవేక్షణ కరువు
బయోమెట్రిక్‌ భయంతో సగం మంది నిర్ణీత వేళలకు హాజరవుతున్నా, వీరిలో అధికశాతం హాజరు నమోదు చేసుకుని తిరిగి సొంత పనుల్లో నిమగ్నమవుతున్న వారే ఎక్కువగా ఉన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 12 గంటల తర్వాత, సాయంత్రం 3 గంటల తర్వాత వెళితే ఏ ఒక్కరూ అందుబాటులో ఉండటం లేదు. కేవలం ఫార్మాసిస్ట్‌లు, ఏఎన్‌ఎంల సేవలే వారికి దిక్కవుతున్నాయి. 30 పడకల ఆసుపత్రులైన గోనెగండ్ల, కోసిగి, బదినేహాలు, లద్దగిరితో పాటు పత్తికొండ, ఆలూరు తదితర ఆసుపత్రుల్లో సైతం వైద్యులు అందుబాటులో ఉండటం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
పీజీ వైద్యం కోసమే..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి పీజీ కోర్సులో చేరేందుకు మార్గం సుగమం అవుతుందనే ఉద్దేశంతో వైద్యులు చేరుతున్నారు. కానీ వీరిలో అధిక శాతం పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకే అధిక సమయం కేటాయిస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ఇలా విధుల్లో చేరి పీజీ కోర్సు రాగానే వెళ్లిపోయే వారి స్థానాలను ఖాళీగా చూపకపోవడంతో, వారి స్థానంలో పక్క పీహెచ్‌సీల వైద్యులను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నారు. ఈ కారణంగా కొందరు వైద్యులు ఎక్కడా విధులు నిర్వహించక డుమ్మా కొడుతున్న సందర్భాలు అనేకం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement