విజయవాడ : రవాణా శాఖలో అవినీతి తలవంపులు తెచ్చేలా ఉందని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. విజయవాడ ఏపీఆర్టీసీ భవన్‌లో ఏడాది కాలంలో శాఖ పనితీరుపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ... ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడితే అది వారి వ్యక్తిగతంగానే కాకుండా రవాణా శాఖకు కూడా తలవంపు వస్తుందన్నారు.
అవినీతిని నిర్మూలించేందుకు రవాణా శాఖ సేవల్లో మరింతగా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 1,140 ప్రాంతాలను గుర్తించామని... వాటిలో 840 చోట్ల రోడ్ల విస్తరణతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మిగిలిన చోట్ల స్థలాన్ని సేకరించి పనులు చేయాల్సి ఉందన్నారు. కాగా గతేడాది రూ.1,920కోట్ల ఆదాయ లక్ష్యానికి గాను రూ.2,128 కోట్లు వసూలైనట్టు ఈ సమీక్షలో మంత్రికి అధికారులు వివరించారు.