- త్వరలో మున్సిపాలిటీకి స్కాచ్ అవార్డు
- కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా వైద్య సౌకర్యాలు
- విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాం
- రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణం దేశానికే ఆదర్శంగా నిలవనుందని రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మంత్రి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధికార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. మెట్రోపాలిటిన్ నగరాలకు ఇచ్చే గుర్తింపునకు ప్రతీకైన స్కాచ్ అవార్డును త్వరలో సిద్దిపేట మున్సిపాలిటీ అందుకోబోతుందన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా సిద్దిపేట పేరు మార్మోగిపోతుందన్నారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా సిద్దిపేటలో వైద్య సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో రూ.30 కోట్లతో సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో ఎస్సీ గురుకుల పాఠశాలలు, సిద్దిపేట పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు.
వచ్చే ఏడాది బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం 270 గురుకుల పాఠశాలలను మంజూరు చేసిందన్నారు. సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలన్నింటికి సొంత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో అన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా జెడ్పీహెచ్‌ఎస్‌లకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశామన్నారు.
దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి పరుస్తున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ జన్మదిన వేడుకల రోజు, తమ కుటుంబీకులు మరణించిన రోజున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణంలో కుమ్మరి సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, శరభేశ్వరాలయం వద్ద మొక్కలు నాటారు.
పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పారుపల్లి పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సిటిజన్స్ క్లబ్, ఎన్జీవోస్ భవన్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలో రూ.7 కోట్లతో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తున్నామని త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. అధునాతన వసతులతో కూడిన షటిల్, ఫుట్‌బాల్, ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అంతకుముందు పలు వ్యాపార సంస్థలను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మంత్రిని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, తెలంగాణ రాష్ర్ట బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, ప్రశాంత్, బ్రహ్మం, గ్యాదరి రవి, టీఆర్‌ఎస్ నాయకులు శర్మ, మారెడ్డి, రవీందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, చిన్నా, సిటిజన్స్ క్లబ్ ప్రతినిధులు కాచం బాలకిషన్, పాండు, ఎన్జీవో భవన్ ప్రతినిధులు గ్యాదరి పరమేశ్వర్, నర్సారెడ్డి, బాలయ్య, ఆంజనేయులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.