సారూ.. మా మొర ఆలకించండి
సారూ.. మా మొర ఆలకించండి
Published Sun, Dec 4 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
- ఉన్నతాధికారులకు రిటైర్డ్ ఉద్యోగుల విజ్ఞప్తి
- నాలుగు రోజులైనా అందని పింఛన్
- బ్యాంకుల వద్ద తప్పని పడిగాపులు
- ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
నందికొట్కూరు: వివిధ శాఖల్లో పని చేసి పదవీ విరమణ చేసిన 1142 మంది పింఛనర్లకు ఈ నెల పింఛన్ అందెకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రూ, 500, రూ, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత తీవ్రం కావడం, వచ్చిన డబ్బు గంటలోపే అయిపోతుండడంతో బ్యాంకులు నిత్యం నో క్యాష్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీలేక పోవడంతో పింఛన్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకుల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి నగదు కోసం బారులు తీరుతున్నారు. గత నెలలో పింఛన్ బ్యాంకు ఖాతాకు జమ అయినప్పటికీ అవసరాలను బట్టి డ్రా చేసుకునేవారం. అయితే గత నెల 8వ తేది రాత్రి పెద్ద నోట్ల రద్దు కావడంతో అది కూడా తీసుకోలేకపోయామని వాపోతున్నారు. దీంతో నిత్యావసరాలు, కుటుంబ ఖర్చులకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నా అమలు కావడం లేదని చెబుతున్నారు. తమ సమస్య పరిష్కారానికి కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నాలుగు రోజులైనా నయా పైసా ఇవ్వలేదు: రాముడు
బ్యాంక్‌లో పింఛన్ డబ్బులు నేటికీ ఒక పైసా చేతికి రాలేదు. నాలుగు రోజుల నుంచి బ్యాంక్‌కు వెళ్లడం, ఇంటికి ఒట్టి చేతులతో రావడం సరిపోయింది. ఇంట్లో నిత్యావసర సరుకులు అయిపోయాయి.
వైద్య ఖర్చులకూ దిక్కులేదు: ప్రసాదరావు
ప్రతి నెలా డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంది. అందుకు అవసమైన డబ్బుల్లేక వెళ్లలేదు. బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిల్చొని డబ్బులు తీసుకునే శక్తి లేదు.
ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి: సుబ్బదాస్
బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పింఛనర్లకు డబ్బులు అందించాలి. డుబ్బులు లేక ఎంతో మంది పెన్షనర్లు ఏన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం సీనియర్ సిటిజన్ల పట్ల స్పందించడం లేదు.
Advertisement
Advertisement