-
సిరిసిల్లకు సీఎం గ్రీన్ సిగ్నల్
-
పెద్దపల్లి, జగిత్యాల యథాతధం
-
కమలాపూర్ మినహా హుజురాబాద్ మనకే
-
హుస్నాబాద్, కోహెడ సిద్దిపేటకే
-
నాల్గు మండలాలు భూపాలపల్లికి
-
రెండు మండలాలు వరంగల్‌కు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా నాలుగు ముక్కలు కానుంది. జిల్లాల విభజన తెరపైకి వచ్చినప్పుడు మూడు జిల్లాలుగానే విభజించిన ప్రభుత్వం నాల్గో జిల్లాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి ప్రకటనలో కరీంనగర్‌తో పాటు జగిత్యాల, సిరిసిల్లలను ప్రకటించి, ఆ తర్వాత సిరిసిల్లకు బదులు పెద్దపల్లిని ప్రతిపాదించారు. సిరిసిల్లకు మొండి చేయి చూపడంతో గత 40 రోజులుగా నిరసనలు మిన్నంటాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనంటూ జేఏసీలుగా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం తాజాగా సోమవారం జరిగిన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపిస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిరిసిల్లను రాజన్న జిల్లాగా ప్రకటించాలని, పెద్దపల్లి నగరపంచాయితీని మున్సిపాలిటీగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కరీంనగర్ జిల్లా నాలుగు ముక్కలు కానుంది. కరీంనగర్ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న జిల్లాల విభజన ప్రక్రియ ఉత్కంఠకు తెరపడినట్లయింది. గత ముసాయిదాలో ప్రతిపాదించిన విధంగా మంథని నియోకవర్గంలోని మహాదేవ్‌పూర్, మల్హార్, కాటారం, మహాముత్తారం మండలాలు కొత్తగా ఏర్పడబోయే భూపాలపల్లి జిల్లాలోకి కలుస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని గతంలో హన్మకొండ రూరల్ జిల్లాలో కలిపే విధంగా ప్రతిపాదించినప్పటికీ తాజా పరిణామాలతో కమలాపూర్ మండలం మినహా మిగతా మండలాలన్నీ కరీంనగర్‌లోనే కొనసాగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హన్మకొండ రూరల్ జిల్లాలోకి కలుపనున్నారు. గత కొద్దిరోజులుగా కరీంనగర్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేస్తున్న హుస్నాబాద్, కోహెడ మండలాలలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలోనే ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాల విభజన ఇలా....
కరీంనగర్ ః కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి, మానకొండూర్, తిమ్మాపూర్, చిగురుమామిడి, శంకరపట్నం, వీణవంక,
సైదాపూర్, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందకుంట
జగిత్యాల ః జగిత్యాల, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, వెల్గటూర్, సారంగపూర్, రాయికల్, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కొడిమ్యాల.
పెద్దపల్లి ః పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగుండం, ముత్తారం, మంథని, సుల్తానాబాద్, ఎలిగేడ్, జూలపల్లి, ధర్మారం.
సిరిసిల్ల ః సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్, వేములవాడ, వేములవాడ రూరల్, పొత్తూరు, ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, బోయినపల్లి.
ప్రతిపాదిత మండలాలు ః జగిత్యాల అర్భన్, మెట్‌పల్లి అర్భన్, కోరుట్ల అర్భన్, బీర్‌పూర్, బుగ్గారం, ఇల్లందకుంట, పోత్తూరు, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, అంతర్గాం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, సిరిసిల్ల రూరల్ మండలాలు అందుబాటులో ఉన్న జిల్లాలో కలపనున్నారు.
ప్రజల కోరిక మేరకే ః ఈటల
ప్రజల కోసమే జిల్లాల విభజన తప్ప రాజకీయ నాయకులు, పార్టీల కోసం కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాల పునర్విభనలో భాగంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావులు సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారిగా గ్రామాలు, మండలాల కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజల కోరిక మేరకు గ్రామాలను సైతం జిల్లాలుగా మార్చామని చెప్పారు. నాయకులు శాశ్వతం కాదని ప్రజలు శాశ్వతమన్నారు. విభజన వల్ల పది మండలాలు కరీంనగర్ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయగా, కొత్తగా 15 మండలాలు ఏర్పాటు కాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కరీంనగర్ 11 లక్షలు, జగిత్యాల 10 లక్షలు, పెద్దపల్లి 8 లక్షలు, సిరిసిల్ల 6 లక్షల జనాభాతో ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టం చేశారు. విభజన పూర్తి శాస్త్రీయంగా ప్రజాభిప్రాయం మేరకే చేసినట్లు తెలిపారు. దేశంలో లక్షలోపు జనాభా గలవి 26 జిల్లాలు, 2 లక్షల జనాభా లోపు 100 జిల్లాలున్నాయని, అరుణాచల్ ప్రదేశ్‌లో 8 వేల మందికి ఒక జిల్లా ఉందన్నారు. ఈ రోజు సమావేశంలో ప్రజాప్రతినిధులతో చర్చించి నివేదిక తయారు చేసి మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక అందజేస్తామని ఈటల వెల్లడించారు.
సిఎంకు కతజ్ఞతలు ః ఈద
కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని కోరగా సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. జిల్లాల పునర్విభనలో భాగంగా సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. గతంలో మంథని రెవెన్యూ డివిజన్ పరిధిలో కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని కలుపొద్దని అనేక ఆందోళనలు జరిగిన విషయాన్ని సిఎంకు వివరించానని, ప్రజల కోరిక మేరకు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలిపితే రవాణా సౌకర్యంతో పాటు అనుకూలంగా ఉంటుందని తెలుపగా సిఎం సానుకూలంగా స్పందించారని ఈద వెల్లడించారు.