మాట్లాడుతున్న మల్లేశం
-
అఖిల పక్షం నాయకుడు సామల మల్లేశం
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై ఆశలు కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు వెనక్కు తగ్గడం సరైంది కాదని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సామల మల్లేశం అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అంశంపై స్థానిక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన మౌనం వీడి జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆడెపు రవీందర్ మాట్లాడుతూ..అర్థం లేని నిబంధనలను సాకుగా చూపి సిరిసిల్లను జిల్లా చేయకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లా సాధన సమితి కన్వీనర్ బుస్సా వేణు మాట్లాడుతూ..ఈనెల 16న స్థానిక వస్త్ర వ్యాపార సంఘంలో అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు వెల్లడించారు. అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల బాలయ్య పంద్రాగష్టు రోజున స్థానిక అంబేద్కర్ చౌక్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడ సంగీతం శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి, మండల అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా సాధన సమితి నాయకులు కుసుమ విష్ణు, అన్నల్‌దాస్ వేణు, పోలు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.