పీపీ తొలగింపుపై వెల్లువెత్తిన నిరసన
పీపీ తొలగింపుపై వెల్లువెత్తిన నిరసన
Published Mon, Oct 3 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
కాకినాడ సిటీ :
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో తెలుగుదేశం ప్రభుత్వం పీపీని తొలగించడంపై నిరసన వెల్లువెత్తింది. (రెండు దశాబ్దాల కిందటి ఈ సంఘటనలో నాటి, ప్రస్తుత ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిందితుడు). సోమవారం వామపక్షాలు, దళిత సంఘాలు నిర్వహించిన చలో కాకినాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు. ముందుగా బాలాజీచెరువు సెంటర్ నుంచి శాంతిభవన్, జీజీహెచ్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి రెండు గంటలు ఆందోళన నిర్వహించి ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఉత్పన్నమైంది. పోలీసులకు వామపక్ష, దళిత సంఘాల నాయకులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల లాఠీచార్జితో పలువురు ఆందోళనకారులు గాయాలపాలయ్యారు. వామపక్ష, దళిత సంఘాల నాయకులుతో పాటు సుమారు 60 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసి నగరంలోని వివిధ స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. శిరోముండన బాధితులతో కలిసి నాయకులు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఎమ్మెల్యే త్రిమూర్తులునుకఠినంగా శిక్షించాలి..
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ శిరోముండనం ఘటన జరిగి సుమారు 20 ఏళ్లు కావస్తున్నా నేటికీ తీర్పు రాక పోవడం దారుణమన్నారు. కేసులో పీపీని తొలగిస్తూ జీవో విడుదల చేయడాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోగా కేసును ఎత్తివేయడానికి చూస్తోందని, ప్రస్తుతం విచారణను అడ్డుకునే విధంగా పీపీని తొలగిస్తూ జీఓ తెచ్చిందని ఆరోపించారు. తొలగించిన పీపీని తిరిగి కొనసాగించాలని, కేసు విచారణను త్వరితగతిన పూర్తిచేయించాలని, ముద్దాయి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి పార్టీలతో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement