అక్కాచెల్లెళ్ల దారుణ హత్య
చింతలపూడి/టి.నరసాపురం: జిల్లాలోని చింతలపూడి, టి.నరసాపురం మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శనివారం ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. మృతులు ఇద్దరి తలలపై ఒకే విధంగా బలమైన గాయాలు ఉన్నాయి. మృతులు టి.నరసాపురం మండలం టి.నరసాపురం ఇందిరాకాలనీకి చెందిన బైగాని మంగమ్మ (35), గండిగూడానికి చెందిన పూలదాసు సీతామహాలక్ష్మి (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ స్వయానా అక్కాచెల్లెళ్లు. శనివారం ఉదయం వీరిద్దరూ కలిసి చింతలపూడి మండలం తీగలవంచ సమీపంలోని తమకు చెందిన జీడితోటలో జీడిగింజలు ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారిని ఇంటికి తీసుకురావడానికి మంగమ్మ కుమారుడు దుర్గాప్రసాద్ ద్విచక్ర వాహనంపై జీడితోటలోకి వెళ్లాడు. అయితే అక్కడ వారి జాడ కనిపించకపోవడంతో తండ్రి సత్యనారాయణకు సమాచారం అందించాడు. వీరిద్దరూ కలిసి తోటలోని కాలిజాడలను అనుసరిస్తూ వెళ్లగా రేచర్ల వనసంరక్షణ సమితికి చెందిన బందంచర్ల అటవీ ప్రాంతంలో సీతామహాలక్ష్మి మృతదేహం కనిపించింది. పక్కనే మంగమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా కిలోమీటరు దూరం తీసుకువెళ్లే సరికి మృతిచెందింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, చింతలపూడి సీఐ పి.రాజేష్, చింతలపూడి ఎస్సై సైదానాయక్, టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్, తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్దన్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టి.నరసాపురంలో తీవ్ర విషాదం
టి.నరసాపురం ఇందిరాకాలనీ, గండిగూడెంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ, సీజన్‌లో జీడిగింజలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నానికి వచ్చేస్తామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారంటూ కుటుంబసభ్యులు బోరుమన్నారు.