పనితోనే మనిషిలో నైపుణ్యం
-
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు
పెదనందిపాడు(గుంటూరు జిల్లా) : పనిచేయడంతోనే మనిషిలో నైపుణ్యం పెరుగుతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఉదయం గుంటూరు జిల్లా పెదనందిపాడు వచ్చిన ఆయన ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన మహిళా నైపుణ్య శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకుండా ఏదోక పనిచేయాలని సూచించారు. పనిచేయకపోతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు మనసు చెడు ఆలోచనల వైపు పయనించి జీవితం దెబ్బతింటుందన్నారు. మరింత ఎక్కువ మంది మహిళలు కుట్టు శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలని కోరారు. కో ఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి బయట నుంచి ఎక్కువ పనులు తెచ్చుకొని అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే అన్ని గ్రామాల వారికి ఆదర్శంగా ఉండొచ్చన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 100వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయటానికి పూర్వ విద్యార్థులు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. గ్రామాభివృద్ధికి కూడా తోడ్పాటునందించాలన్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. సిబార్ దంతవైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ గ్రామంలో త్వరలో సర్వే చేయించి దంత సమస్యలున్న వారికి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసా పత్రాలు, కుట్టుమిషన్లు అందజేశారు. కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు సతీమణి శివపార్వతి, సర్పంచ్ కొలగాని కోటేశ్వరరావు, ఎంపీపీ ముద్దన నగరాజకుమారి, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.మోహన్‌రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్రా బాలకష్ణ, ఎంపీడీవో పి.బాలమ్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజరు సి.ముత్యం, నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు, రావి శివరామకృష్ణయ్య, వెల్లంకి ప్రసాద్, కుర్రా హరిబాబు, పోలినేని అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.