పంపు ‘సెట్’ అయ్యేదెప్పుడు..?
పంపు ‘సెట్’ అయ్యేదెప్పుడు..?
Published Wed, Oct 5 2016 11:42 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM
నత్తనడకన ఏజీడీఎస్‌ఎం పైలెట్ ప్రాజెక్టు
ఏడాదిన్నరలో 15 శాతం మాత్రమే అమలు
ఆసక్తి చూపని రైతులు
వ్యవసాయంలో విద్యుత్ ఆదాకు పాతమోటార్ల స్థానంలో అధునాతన పంపు
సెట్లు ఏర్పాట్లు చేసే డిమాండ్ ఆధారిత వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏజీడీఎస్‌ఎం) నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును రాజానగరం మండలంలో చేపట్టారు. మండలంలోని 29 గ్రామాల్లో గల 2,496 పంపుసెట్లను ఈ పథకంలో మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇంతవరకూ కేవలం 456 మోటార్లనే మార్చగలిగారు. అంటే 15 శాతం లక్ష్యాన్ని మాత్రమే ఏడాదిన్నరకు సాధించగలిగారు.
సాక్షి, రాజమహేంద్రవరం : పథకాలు ఘనం.. ఆచరణ అల్పం అనడానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది డిమాండ్ ఆధారిత వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏజీడీఎస్‌ఎం). మెట్ట ప్రాంతంలో బోరు ఆధారిత వ్యవసాయంలో పాతమోటార్ల స్థానంలో అధునాతన పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రాజానగరం మండలంలో ఈ పథకాన్ని 2015 ఏప్రిల్ 5 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకంలో రైతుల వద్ద ఉన్న పాత మోటార్ల స్థానంలో 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ కలిగిన అధునాతన వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్), ఈఈఎస్‌ఎల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. రూ. 18.95 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐదేళ్లలో రూ. 40.45 కోట్ల విలువైన 21.317 మిలియన్ల విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాజానగరంలో మండలంలోని 29 గ్రామాల్లో 29 ఫీడర్ల పరిధిలోని 2,496 పంపుసెట్ల స్థానంలో స్టార్ రేటింగ్ మోటార్లు మార్చాల్సి ఉంది. దీనికి ఏడాది కాలపరిమితిగా నిర్దేశించారు.
రైతుల్లో అనాసక్తి
రైతులు తమ అవసరాలకు అనుగుణంగా 5, 10, 15, 20 హార్స్‌పవర్ (హెచ్‌పీ) మోటార్లు వినియోగిస్తున్నారు. ఉచితంగా ఇస్తున్నప్పటికీ పాత పంపుసెట్టు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. స్టార్ రేటింగ్ పంపు సెట్టు అమర్చే ఈఈఎస్‌ఎల్ పాత మోటారును తీసుకుంటుంది. ఐదేళ్లపాటు ఉచితంగా సర్వీసు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే సర్వీస్ చేసే సిబ్బంది సకాలంలో రాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే రైతులు దీనిపై ఆసక్తి చూపడం లేదు.
ప్రాజెక్టు పురోగతి నామమాత్రం
ఈ ఏడాది అక్టోబర్ నాటికి 100 శాతం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈ నెల 3వ తేదీ నాటికి మొత్తం 765 మోటార్లను మాత్రమే మార్చగలిగారు. ఈ నెలాఖరు నాటికి మిగిలిన 1,731 మోటార్లను మార్చాల్సి ఉంది. ఈ పథకంపై పలుమార్లు రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ ప్రాజెక్టు పురోగతి అంతంత మాత్రంగానే ఉంది.
Advertisement