సెల్లార్‌లో బండరాళ్లొస్తే? | Serious delay in blasting permissions | Sakshi
Sakshi News home page

సెల్లార్‌లో బండరాళ్లొస్తే?

Published Sat, Jul 14 2018 2:24 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

Serious delay in blasting permissions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ నివాస ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సెల్లార్‌ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వచ్చాయి. దాన్ని తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ పనిని మరో సబ్‌–కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు మొదటి కాంట్రాక్టర్‌. బ్లాస్టింగ్‌ చేయాలని నిర్ణయించుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చాడు సబ్‌–కాంట్రాక్టర్‌.

అంతే! సమాచారం ఎవరందించారో తెలియదు గానీ క్షణాల్లో టాస్క్‌ఫోర్స్‌ చేరుకోవటం, సబ్‌–కాంట్రాక్టర్‌ను నిలదీయడంతో అతను నిర్మాణ సంస్థ యజమాని పేరు చెప్పడం,  పోలీసులు యజమాని మీద కేసు నమోదు చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. వాస్తవానికి ఈ సంఘటనతో డెవలపర్‌కు ఎలాంటి సంబంధం లేదు. బ్లాస్టింగ్‌ చేయమని గానీ లేదా తవ్వకం పనిని సబ్‌–కాంట్రాక్ట్‌కు ఇవ్వమని గానీ ఒప్పందమేమీ చేసుకోలేదు.

...పై సంఘటన నగరంలోని చాలా మంది డెవలపర్లకు అనుభవమే. డెవలపర్, కేసు, సబ్‌–కాంట్రాక్టర్‌ విషయాలను పక్కన పెడితే.. అసలు చర్చించాల్సిన అంశం.. ‘‘సెల్లార్‌ తవ్వకంలో అడ్డువచ్చే బండరాళ్లను తొలగించే క్రమంలో పేలుడు జరపాల్సి వచ్చినప్పుడు వాటి అనుమతులు ఎవరిస్తారనే దాని గురించి!’’ భూమి లోపల 10 అడుగుల లోతు కంటే ఎక్కువ సెల్లార్‌ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు సంబంధిత కాంట్రాక్టర్లు వీటిని కూలీలు, పనిముట్ల సహాయంతో తొలగిస్తుంటారు.

పెద్ద పెద్ద బండరాళ్లు, కఠినమైన రాళ్లు వచ్చిన సందర్భాల్లో మాత్రం పేలుళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇదే డెవలపర్లకు నరకంగా మారింది. ఎందుకంటే బ్లాస్టింగ్‌ అనుమతులు ఏ ప్రభుత్వ విభాగం ఇస్తుంది? ఎన్ని రోజుల్లో అనుమతులొస్తాయి? అసలు ఫీజు ఎంత? ఎలాంటి పత్రాలను జత చేయాలి? వంటి విధివిధానాలేవీ లేవని ఓ డెవలపర్‌ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు.

చేతులు తడిపితేనే అనుమతులు..
బ్లాస్టింగ్‌ అనుమతుల కోసం కాళ్ల చెప్పులరిగేలా తిరిగితే తప్ప రాని పరిస్థితి. పైగా చేతి చమురూ వదులుకోవాల్సిందే. స్థానిక పోలీసులు, అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేసుకోవాల్సి వస్తుందని.. దీంతో అనవసరంగా అవినీతి పెరుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్‌కు బ్లాస్టింగ్‌ అనుమతుల కోసం ఆరేడు నెలల దాకా వేచి ఉండాల్సి వస్తుందని వాపోయారు.
విధివిధానాలుండాల్సిందే..
   పేలుళ్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా విభాగం, అధికారులు ఉండాలి. పేలుళ్లు జరిపే క్రమంలో పర్యవేక్షణ జరపాలి.
    మున్సిపాలిటీలోనే నిర్మాణ అనుమతులతోనే పేలుడుకు సంబంధించిన అనుమతులు ఇస్తే బాగుంటుంది.  
    అన్ని సందర్భాల్లోనూ పేలుడు పదార్థాలను వినియోగించకుండా రసాయనాలను వినియోగించే వీలుండాలి.
    స్థానికంగా ఉన్న ఇతర భవనాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ ఏర్పాట్లు తీసుకోని డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement