పట్టిసీమపై చర్చకు రాకుండా ప్రగల్భాలా?
– ఎమ్మెల్యే బుచ్చయ్యపై ఉండవల్లి మండిపాటు
– తనది తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని వెల్లడి
సాక్షి, రాజమహేంద్రవరం : పట్టిసీమ శుద్ధ దండగ ప్రాజెక్టని, రూ.1,650 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నుంచి కృష్ణా నదికి తీసుకెళ్లి సముద్రంలో కలుపుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పునరుద్ఘాటించారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ప్రయోజనం శూన్యమని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న తన సవాల్‌ను స్వీకరించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ తర్వాత ఆ విషయం మరచిపోయి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
కొట్టించుకోవడం బుచ్చయ్యకు అలవాటే..
కృష్ణా బ్యారేజ్‌పై చర్చ పెడితే అక్కడి రైతులు తనపై దాడి చేస్తారని బుచ్చయ్య చెప్పడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. కొట్టడం, కొట్టించుకోవడం బుచ్చయ్యకు బాగా అలవాటైన పనేనన్నారు. రాజమహేంద్రవరం కంబాలచెరువులో ప్రజలు బుచ్చయ్యను కొట్టిన విషయం నగరవాసులు ఇంకా మరచిపోలేదన్నారు. పట్టిసీమపై తన వాదన అబద్ధమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణలు చెబుతానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఉండవల్లి చెప్పారు. పట్టిసీమ నుంచి కోట్ల రూపాయల విద్యుత్ ఉపయోగించి 45 టీఎంసీలను కృష్ణాలో పోశారని చెప్పారు. అదే సమయంలో కృష్ణా నుంచి 55 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని జలవనరులశాఖ వెబ్‌సైట్ నుంచి సేకరించిన సమాచారం చూపించారు. మంత్రి దేవినేని ఉమా ఆ నీరు పులిచింతల నుంచి వెళ్లిందని చెబుతున్నారని, పులిచింతల నుంచి సముద్రంలోకి వెళ్లింది కృష్ణా జలాలు కాదా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడం సరి కాదన్నారు. బుచ్చయ్యకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. సమావేశంలో అల్లుబాబి, పి.అచ్యుత్‌దేశాయ్, చెరుకూరి రామారావు, నక్కా నగేష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.