ఆత్మహత్యే శరణ్యం
► కిరోసిన్ బాటిల్‌తో చిరువ్యాపారి హల్‌చల్
►ట్రాఫిక్ పోలీసుల వేధింపులే కారణమని ఆవేదన
హన్మకొండ చౌరస్తా: రెండు నెలలుగా దుకాణం పెట్టనిస్తలేరు.. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది.. కుటుంబపోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ఆత్మహత్యే శరణ్యమని మంగళవారం హన్మకొండ చౌరస్తాలోని జీవన్‌లాల్ కాంప్లెక్స్ వద్ద చిరువ్యాపారి కిరోసిన్ బాటిల్ చేతిలో పట్టుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగా డు. స్థానిక చిరు వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు దశాబ్దాలకు పైగా హన్మకొండ చౌరస్తాలో రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుం టూ కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. కాగా చిరు దుకాణాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు రెండు నెలల క్రితం చిరు దుకాణాలను తొలగించారు.
మరొకసారి రోడ్డు పక్కన దుకాణాలు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రత్యమ్నాయం చూపకుండా, దుకాణాలు పెట్టకుండా అడ్డుకుంటే బతకడం కష్టమని భావించి మంగళవారం ఉదయం సుమారు 15మంది వారి వ్యాపారాలను మొదలుపెట్టారు. పెట్రోలింగ్‌లో ఉన్న హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై సోమయ్య తన సిబ్బందితో వచ్చి చిరుదుకాణాల సామానును స్టేషన్‌కు తరలించే యత్నం చేశారు. దీంతో అడ్డుకున్న చిరు వ్యాపారులకు, పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది.
దీంతో సామాను వదిలేసిన పోలీసులు రోడ్డు పక్కన పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన టైలర్‌స్ట్రీట్‌కు చెందిన చిరువ్యాపారి రమేష్ కిరోసిన్ బాటిల్ వెంట తీసుకుని దుకాణం పెట్టకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తోటి హాకర్లు సర్ధి చెప్పడంతో సద్దుమణిగిన రమేష్, అనంతరం అందరూ కలిసి ట్రాఫిక్ ఏసీపీ సురేంద్రనాథ్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నప్పటికీ ఫలితం లేదని చిరు వ్యాపారులు వాపోయారు.