
కాటేసిన విషసర్పాలు
బుడిబుడి అడుగుల పసిబాలుడిపై నాగుపాము విషం చిమ్మింది. అమ్మ ఒడిలో అదమరిచి నిద్రపోతున్న చిన్నోడి ఉసురు తీసింది.
నెంటూరులో బాలుడు బలి
వర్గల్ : బుడిబుడి అడుగుల పసిబాలుడిపై నాగుపాము విషం చిమ్మింది. అమ్మ ఒడిలో అదమరిచి నిద్రపోతున్న చిన్నోడి ఉసురు తీసింది. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన వర్గల్ మండలం నెంటూరులో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నెంటూరుకు చెందిన చీర్ల స్వామి, భార్య కవిత గురువారం మధ్యాహ్నం ఏడాదిన్నర కొడుకు పరశురామ్‌కు ఇంట్లో పాలు తాగించి నిద్రపుచ్చింది. అనంతరం తాను కూడా నిద్రలోకి జారుకుంది.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన నాగుపాము పసిబాలుడిని పలుమార్లు కాటేసింది. బాధ తట్టుకోలేక బాలుడు గుక్కపెట్టి ఏడుస్తుండడంతో ఉలిక్కిపడి లేచిన తల్లి పక్కనే పడగవిప్పి ఉన్న పామును చూసి హడలిపోయింది. చిన్నోడిని ఎత్తుకుని పాము పాము అని అరుస్తు ఆరుబయటకు పరుగులు తీసింది. బోరుమని విలపిస్తూ కుటుంబసభ్యులు బాలుని వైద్యచికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఏడాదిన్నరకే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ తల్లి కవిత రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.