సోలార్ పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ విజయమోహన్
మార్చి ఆఖరుకు సోలార్ పార్క్ సిద్ధం
Published Wed, Oct 19 2016 9:50 PM | Last Updated on Mon, Oct 22 2018 8:40 PM
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
గడివేముల: అల్ట్రామెగా సోలార్ పార్క్‌ను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. గని గ్రామ పొలిమేరలో నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వెయ్యి మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కు ఎక్కడా లేదని, కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. ఇందులో 500 మెగా వాట్ల పనులను గ్రీన్‌కవర్, 350మెగావాట్ల పనులను సాఫ్ట్‌బ్యాంకు, వంద మెగా వాట్ల పనులను హజాద్, 50 మెగా వాట్ల పనులను అదాని కంపెనీ చేపడుతోందన్నారు. ఏప్రిల్‌లో సోలార్ పార్క్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో కార్మికులు.. 500 నుంచి 600మంది అవసరం అవుతారని, టెక్నికల్ అధికారుల ద్వారా ఏ విషయం తెలియజేస్తామన్నారు. సోలార్ పార్క్ ఏర్పాటు కోసం గని, శకునాల గ్రామాల్లో 5,500 ఎకరాల భూములను తీసుకున్నామన్నారు. అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఆర్‌డీఓకు అప్పీలు చేసుకోవచ్చన్నారు.సోలార్ పార్కు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులకు అవసరమైన వసతులు కలిపిస్తామన్నారు. కార్యక్రమంలో సోలార్ ఎండీ ఆదిశేషు, వివిధ కంపెనీల ప్రతినిధులు మోహన్ జతన్, సన్‌డ్రాజా, నెడ్‌క్యాప్ ఎస్‌ఈ నారాయణమూర్తి, ఈఈ సుధాకర్, నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ రామసుబ్బయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement