కొడుకే చంపేశాడు..
తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు
మిస్టరీని చేదించిన పోలీసులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మేడ్చల్‌రూరల్: తండ్రి తాగివచ్చి అకారణంగా తనను, ఇంట్లో వారిని తిడుతున్నాడని ఆగ్రహించిన ఓ తనయుడు తండ్రిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారంపేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రాజశేఖర్‌రెడ్డి తో కలిసి వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అలీ(50) గత నెల 12న రాత్రి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 20న మరణించాడు. కాగా 14న తన తండ్రి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇందుకు కారణం తెలియడం లేదని మృతుడి కుమారుడు మహమ్మద్ ఉస్మాన్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కుమారుడే మహమ్మద్ ఆలిపై దాడి చేసి గాయపర్చినట్లు గుర్తించారు.. మహమ్మద్ అలీ(50) భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు మహమ్మద్ ఉస్మాన్(22) కొద్ది రోజులుగా ఖాళీగా ఉంటున్నాడు. మహమ్మద్ అలీ గత నెల 11న మనవరాలి తొట్టెల ఫంక్షన్‌లో తనతో పాటు కూడా కుటుంబసభ్యులను అకారణంగా తిట్టడంతో తండ్రిపై కోపం పెంచుకున్న ఉస్మాన్ తండ్రికి బుద్ధి చెప్పాలని నిర్ణరుుంచుకున్నాడు. 12వ తేదీ రాత్రి మహమ్మద్ అలీ నిద్రిస్తున్న సమయంలో ఉస్మాన్ అతడిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు.
అనంతరం బాత్‌రూంలో రాడ్‌కు అంటిన రక్తపు మరకలను కడిగి ఎవరికీ అనుమానం రాకుండా రాడ్‌ను పారవేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మహమ్మద్ ఆలీ వాంతులు చేసుకోవడం గమనించిన నిందితుడు కుటుంబసభ్యుల సహకారంతో అతడిని ఆస్పత్రికి తరలించాడు. మద్యం మత్తులో కిందపడడంతో గాయాలైనట్లు వైద్యులకు చెప్పాడు. అనంతరం పోలీసులకు అనుమానం రాకుండా నవంబర్ 14న మేడ్చల్ పీఎస్‌కు వెళ్లి తన తండ్రి కి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని గాయాలెలా అయ్యాయో తెలియడం లేదని ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు వైద్యులను విచారించగా తలపై బలంగా కొట్టినందునే అతను గాయపడినట్లు చెప్పడంతో హత్యకేసు నమోదు చేసుకున్నారు. గత నెల 20న చికిత్స పొందుతూ మహమ్మద్ అలీ మరణించగా దీంతో పోలీసులు శనివారం మృతుడి పెద్ద కుమారుడు మహమ్మద్ ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతుడి హత్యకు ఉపయోగిం చిన ఇనుపరాడ్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హత్యకేసు చేదించిన మేడ్చల్ పోలీసులకు ఏసీపీ అభినందించాడు.