బరిలో దిగిన బాస్..
స్పెషల్ డ్రైవ్‌తో హడలెత్తించిన ఎస్పీ దుగ్గల్
23 కేసులు నమోదు, భారీగా జరిమానా
ఆదిలాబాద్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ స్వయంగా బరిలోకి దిగారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో ఎస్పీ స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హడలెత్తించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. లెసైన్సు, వాహన ధ్రువపత్రాలు, ఇన్సురెన్స్‌లేని వాహనాలకు జరిమానా విధించడంతోపాటు అసలే పత్రాలు లేని 23 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు.
వాహనాలు అతివేగంగా నడపకూడదని, ఎదురుగా వాహనాలు వచ్చే సమయంలో ఓవర్‌టేకింగ్ చేయకూడదని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పని సరిచేస్తూ భారీ జరిమానాలు విధించేందుకు స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టణ సీఐలు వెంకటస్వామి, సత్యనారాయణ, ఎస్సైలు వేణుగోపాల్‌రావు, రాజలింగు, శ్రీనివాస్ ఉన్నారు.