అన్నదాతకు యాప్ అండ
అన్నదాతకు యాప్ అండ
Published Tue, Aug 29 2017 10:11 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
’ప్లాంటిక్స్’తో రైతులకు మేలు
తెగుళ్లు, నివారణ సూచనలు వెంటనే
తెలుగులోనూ సమాచారం
సహకారం అందిస్తున్న ఇక్రిశాట్
ఏలూరు (మెట్రో):
మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ ఉంటుంది. రైతు వెచ్చించే ఖర్చులో పురుగు మందులదే సింహభాగం. పంటలో తెగులు కనిపిస్తే చాలు ఏ మందులు పిచికారీ చేయాలో అర్థంకాక అన్నదాతలు ఆందోళన చెందుతుంటారు. దీంతో పంటలు పరిశీలించకుండానే వ్యాపారులు చెప్పిందే వేదంగా రైతులు పురుగుమందులు వాడేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను పరిశీలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేకంగా తెగుళ్ల నివారణలు సూచించేందుకు మొబైల్ యాప్‌ను ఇటీవల రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాంటిక్స్ (పిఎల్‌ఎఎన్‌టిఐఎఎక్స్) అనే ఈ యాప్ ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
మారుతున్న ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఓ ప్రయివేటు మొబైల్ కంపెనీ సర్వే ప్రకారం ప్రస్తుతం 80 శాతం మంది రైతుల వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇలాంటి వారికి ఈ నూతన యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఈ యాప్‌ను ఉపయోగించుకుని తెగుళ్ల సమాచారాన్ని గుర్తించగలుగుతున్నారని వ్యవసాయాధికారులు అంచనా.
ఈ యాప్ జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది అక్కడ ఫలితాలు సాధించడంతో మన దేశంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్రిశాట్ అధికారులు జర్మనీతో ఒప్పందం చేసుకున్నారు. మొదటిగా హిందీ భాషలో అందుబాటులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ చొరవతో ఈ సంవత్సరం జూన్ నుండి తెలుగు భాషలో లభ్యమయ్యేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ యాప్ డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, పోర్చుగీసు, హిందీ, తెలుగు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
నిమిషాల్లో సమచారం:
ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. తర్వాత పంటల వారీగా ఆప్షన్లు కనిపిస్తాయి. ఏ పంటపై తెగుళ్ల సమాచారం కావాలో ఆ పంట ఐకాన్‌పై క్లిక్ చేస్తే కెమెరా తెరుచుకుంటుంది. చెట్టుకు తెగులు ఉన్న చోట ఫొటో తీసి ఆప్‌లోడ్ చేస్తే కొద్ది సేపటికే ఆ తెగులుకు సంబంధించిన వివరాలు, లక్షణాలు, పిచికారీ చేయాల్సిన మందుల వివరాలతో శాస్త్రవేత్తలుగానీ, అనుభవజ్ఞులైన రైతులు నుంచి కానీ సమాచారం వస్తుంది. సూచించిన మందులు తెచ్చుకుని పిచికారీ చేస్తే సరిపోతుంది. ఎంత మోతాదులో వాడాలో కూడా వివరాల్లో ఉంటుంది. దీనికి ఇంటర్‌నెట్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వరి, అరటి, కంది, గోధుమ, చిక్కుడు, టమాట, దానిమ్మ, పత్తి, బంగాళాదుంప, బొప్పాయి, మామిడి, పెసలు, మినుములు, మిర్చి, మొక్కజొన్న, వంకాయ, సెనగ, సోయాబీన్ వంటి 18 రకాల పంటలకు సంబంధించి ఐకాన్‌లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర పంటలు అనే ఐకాన్ కూడా ఏర్పాటు చేయడంతో ఇతర పంటల వివరాల కోసం ఆ ఐకాన్‌ను ఎంచుకుంటే మిగిలిన పంటలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.
జీపీఎస్ సహకారంతో వాతావరణ సూచనలు :
వాతావరణ పరిస్థితులు, గాలిలో తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో ఆప్షన్లు ఉన్నాయి. మొబైల్ జీపీఎస్ ఆప్షన్ ఆన్‌చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారం తెలుస్తుంది.
Advertisement