తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కార్యక్రమాలు
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కార్యక్రమాలు
Published Thu, Aug 3 2017 11:07 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
కలెక్టర్ మిశ్రా
కాకినాడ సిటీ : తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్యారోగ్యశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాలులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ తల్లి పాలే బిడ్డకు శ్రేష్టమన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో తల్లుల విషయంలో మొదటి త్రైమాసికం నుంచి వారిని పర్యవేక్షించి అవసరమైతే పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ 25వ తల్లిపాల వారోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
1098 హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం
1098 హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్‌కు మహిళలు, పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు సమాచారమివ్వాలని, దీనిని విస్తృత ప్రచారం చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా నివారణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఎక్కువగా ఉందని, దీని నిరోధానికి ఐసీడీఎస్, పోలీస్, రెవెన్యూ సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. హెల్ప్‌లైన్‌కు సంబంధించి పోలీస్, ఆర్టీసీ, రైల్వే స్టేషన్‌లో ప్రజలకు కనిపించే ప్రాంతాలలో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, ఐసీడీఎస్ పీడీ పి.శారదాదేవి, యూనిసెఫ్ స్టేట్‌కో–ఆర్డినేటర్ సుహాసిని, డీఎంహెచ్‌వో కె.చంద్రయ్య, జీఎంఆర్ ప్రతినిధి సుధాకర్, జిల్లా శిశు సంరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement