గిరిజన గోస
♦ అభివృద్ధికి దూరంగా గిరిజన గూడేలు
♦ ఆచరణకు నోచని పాలకుల హామీలు
♦ కోట్లు ఖర్చు చేస్తున్నా దరి చేరని ఫలాలు
♦ నీరు, రోడ్లు, విద్య, వైద్యమూ కరువు
♦ దుర్భర జీవితాలు గడుపుతున్న చెంచులు
♦ గూడేలపై దయ చూపాలని వేడుకోలు
పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. వెరసి గిరిజనుల్ని అభివృద్ధికి దూరం చేశాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి.. నాగరికత కొత్త పుంతలు తొక్కుతోంది.. అయినా గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండటం లేదు. గిరిజన సంక్షేమశాఖ చెంచుల అభ్యున్నతి కోసం ఐటీడీఏ ద్వారా కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా కనీసం తాగునీరు, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అక్కడ విద్యుత్ వెలుగులు కనిపించవు.. నేటికీ కిరోసిన్ దీపమే దిక్కు. ప్రభుత్వాలు ఊదరగొడుతున్న స్వచ్ఛత మచ్చుకైనా కనిపించదు. ఆ దిశగా అవగాహన కల్పించడంలో పాలకులకు శ్రద్ధ లేదు. పుల్లలచెరువు మండలంలోని చెన్నపాలెం చెంచులు ఆధునికతకు దూరంగా దయనీయ జీవనం గడుపుతున్నారు.
పుల్లలచెరువు :
మండల కేంద్రం పుల్లలచెరువుకు 15 కిలోమీటర్ల దూరంలో చెన్నపాలెం చెంచుగూడెం ఉంది. నల్లమల అభయారణ్యంలో ఈ గూడెంలో దాదాపు 80 కుటుంబాలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నాయి. ఇక్కడ నేటికీ విద్యుత్తు సౌకర్యం, రహదారులు, నివాసం ఉండేందుకు పక్కా గృహాలు కానీ లేవంటే ఆశ్చర్యపోక తప్పదు. వర్షాకాల సమయంలో చెట్ల నీడలోనే ఆశ్రయం పొందుతున్నారు. మొత్తం 80 కుటుంబాలకు ఇక్కడున్న నాలుగు చేతి పంపులే ఆధారం. అవి మరమ్మతులకు గురి అయితే సమీపంలో ఉన్న చెలమ నీరే దిక్కు. గిరిజనుల కోసమే తాము ఉన్నామంటూన్నా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రకటిస్తున్నా ఆ ఫలాలు చెంచులకు చేరడం లేదు.
రేషన్ సరుకులకు కాలినడకే..
చెన్నపాలం గిరిజనులు రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఏడు కిమీ దూరంలో ఉన్న గారపెంట చెంచుగూడేనికి కాలినడకనే వెళ్లి తెచ్చుకోవాలి. స్థానికంగా రేషన్ సరుకులు అందించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.
అనుకోని ఆపదొస్తే వల్లకాటికే..
ఈ గూడేనికి సరైన రహదారి లేదు. అనుకోని అపాయం, అనారోగ్యం సంభవిస్తే వైద్యం అందుబాటులో లేదు. బయట ప్రపంచానికి తెలియకుండానే కాటికి తీసుకెళ్లాల్సిందేనని, ఇంతకు మించి గత్యంతరం లేదని, అత్వవసర పరిస్థితుల్లో ఆకు పసరునే నమ్ముకోవాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు.
విద్యుత్ వెలుగులు కరువు..
గిరిజన గూడేల్లో కొన్ని సంవత్సరాల కిందట కొంత మేరకు విద్యుత్తు లైన్లు వేశారు. కానీ, అవి నేటికీ పూర్తికాలేదు. దీంతో రాత్రి అయితే అంధకారంలోనే మగ్గాల్సిన పరిస్థితి. ఈ కాలంలోను కరెంటు వెలుగులు కరువయ్యాయని, బయట ప్రపంచం చూడాలంటే 15కిమీ లో ఉన్న పుల్లలచెరువుకు రావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ జిల్లా అధికారులు గూడేన్ని సందర్శించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని చెంచులు కోరుతున్నారు.