మావోల కోటలో కానరాని అభివృద్ధి
మావోల కోటలో కానరాని అభివృద్ధి
Published Tue, Feb 21 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
ఇష్టారాజ్యంగా పనులు ప్రతిపాదనలు
రంపచోడవరం : మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపీ) కేంద్రప్రభుత్వం ఇచ్చే ని«ధులను ఐటీడీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఫలితంగా అసలు లక్ష్యం నెరవేరకుండానే నిధులు ఖర్చు అవుతున్నాయి. ఐఏపీ నిధుల ద్వారా మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు భిన్నంగా ఐటీడీఏ అధికారుల తీరు ఉంటోంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన నిధులను మైదాన ప్రాంతంలో కూడా ఖర్చు చేశారు. నేటికీ అనేక మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు.
గుర్తేడు రోడ్డుకు మోక్షమెప్పుడు?
ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న గుర్తేడు వరకు రోడ్డు సదుపాయం మెరుగుపడింంది. ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సర్వీసును కూడా నడుపుతున్నారు. గుర్తేడు నుంచి పాతకోట మీదుగా మంగంపాడు వరకు నిర్మాణం చేపట్టిన రోడ్డు నేటికీ పూర్తి చేయలేకపోయారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన రోడ్డు పనిని మావోలు అడ్డుకుని వాహనాలు తగులబెట్టారు. అప్పటి నుంచి ఈ రోడ్డు నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా అనేక గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వై.రామవరం మండల కేంద్రం చేరుకునేందుకు గుర్తేడు నుంచి వై.రామవరానికి చేపట్టిన రోడ్డు నిర్మాణం దశాబ్దకాలం అవుతున్నా నేటికీ పూర్తి కాలేదు.ఈ రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తే సుమారు వంద గ్రామాలకు మండల కేంద్రం దగ్గర అవుతుంది. అధికారులు ఇలాంటి కీలకమైన రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయడంలో శ్రద్ధ చూపడం లేదు.
సున్నంపాడు – నూరుపూడి వంతెన నిర్మాణమెప్పుడు?
మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద కొండ వాగుపై వంతెన నిర్మాణం లేక 40 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు ఇక్కడ వంతెన నిర్మాణం కోసం చర్యలు తీసుకోలేదు. మారేడుమిల్లి–గుర్తేడు రోడ్డులో సంగువ కాలువపై ఆకుమామిడికోట వద్ద వంతెన నిర్మాణం చేయడం లేదు. సుమారు వంద గ్రామాల గిరిజనులు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తారు. ఐఏపీ నిధులతో ఇలాంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటే బాగుండేది. అనేక చోట్ల ఆశ్రమ పాఠశాలల్లో సరైన మౌళిక వసతులు లేవు. అంగన్‌వాడీ సెంటర్‌లు శిధిలావస్థకు చేరుకున్నాయి. 2010–11 సంవత్సరంలో ప్రారంభించిన ఐఏపీ పధకంలో ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించి చేపట్టడంలో ఐటీడీఏ అధికారులు పూర్తిగా విఫలమైయారు. మైదాన ప్రాంతంలో వసతిగృహాలు నిర్మించారు. టీఎస్‌పీ వంటి నిధులతో వీటి నిర్మాణం చేయవచ్చు. ఐఏపీ నిధులు ఖర్చు చేయడమే చూసుకున్నారుగానీ గిరిజనుల ప్రయోజనాలను గాలికివదిలేశారు. కేంద్ర రూ. 120 కోట్లు మంజూరు చేస్తే రూ.100 కోట్లు ఖర్చు చేశారు. నాలుగేళ్లలో అనేక చోట్ల పనులు పూర్తి చేయలేదు.
విలీనంలోనూ అదే పరిస్థితి
విలీన మండలాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో సైతం ఐఏపీ నిధులు సక్రమంగా అమలకు నోచుకోలేదు. విలీన మండలాల్లో చత్తీస్‌గడ్ సరిహద్దుకు అనుకుని ఉన్న చింతూరు, ఎటపాక మండలాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది. సరిహద్దు గ్రామాల్లో ఏళ్ల తరబడి రహదారులు ఆధ్వానంగా ఉన్నా అధికారులు వాటిపై దృష్టి సారించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాలు మావోయిస్టు ప్రభావిత హైరిస్క్ జోన్‌లో ఉండేవి. అప్పట్లో కోట్లాది రూపాయలు ఐఏపీ నిధులు విడుదలైనా అధికారులు వాటిని ప్రధాన రహదారులు, హాస్టల్ భవనాలు నిర్మించేందుకే ప్రాధాన్యమిచ్చారే తప్ప మావో ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధికి ఖర్చు చేయలేదు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి నుంచి చత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఉన మల్లంపేటకు వెళ్లే రహదారి ఏళ్లతరబడి అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఈ రహదారికి సంబంధించి ఐదుసార్లు టెండర్లు పిలిచినా మావోయిస్టుల భయంతో రహదారి వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సద్వినియోగం కాలేదు. చింతూరు మండలంలో చదలవాడ, చౌలూరు, గవల్లకోట వంటి మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యంం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.కొండకాలువలపై వంతెన నిర్మాణాలు కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ఐఏపీలో ఇలాంటి గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే పథకం లక్ష్యం నెరవేరుతుంది.
Advertisement
Advertisement