మన్యం.. దైన్యం
మన్యం.. దైన్యం
Published Tue, Aug 8 2017 11:39 PM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM
కొండల మధ్య గ్రామాలు
వెళ్లే దారి లేని పరిస్థితి
పల్లెల్లో కనీస వసతుల్లేవు
వైద్యం, తాగునీటికి తీవ్ర ఇక్కట్లు
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఏటా గిరిజన సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. గిరిజనుల బతుకులు మెరుగు పడడం లేదు. కనీస వసతులు లేని పల్లెల్లో గిరిజనులు జీవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక గిరిజనులు మృత్యువాత పడుతున్న దుర్భర స్థితిలో మన్యంలో నెలకొంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ లక్ష్యాలు సాధించలేక చతికిలపడింది. గ్రామాలకు రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు శ్రద్ధే చూపడం లేదు.
రంపచోడవరం : ఏజెన్సీలో ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గిరిజనులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. ఏజెన్సీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నాలుగు మండలాలకు చెందిన గిరిజనులు నిర్వాసితులవుతున్నారు. గతంలో భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నిర్వాసితులైన గిరిజనులకు ఉపాధి చూపలేదు. ప్యాకేజీ ద్వారా వచ్చి సొమ్ము ఖర్చు చేసుకున్న వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
చట్టాల అమల్లో నిర్లక్ష్యం
ఏజెన్సీ కోసం చేసిన ప్రత్యేక చట్టాల అమల్లో నిర్లక్ష్యం గిరిజనుల జీవితాలు అణగారిపోతున్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం కొండపోడు సాగు చేసుకుంటున్న వారు పట్టాలు పొందలేకపోయారు. ప్రధానంగా పోడు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే గిరిజనులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం లేదు. పీసా కమిటీల ప్రమేయం లేకుండానే అభివృద్ధి పనులను బినామీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఏజెన్సీలో వెనుకబడిన తెగగా గుర్తించిన పీటీజీల (కొండరెడ్డి గిరిజనులు) అభివృద్ధిని పట్టించుకునే వారే లేరు. ఐటీడీఏ అమలు చేసే పథకాల లబ్ధి వారికి చేరడంలేదు. ఏజెన్సీలో అనారోగ్యం, పౌష్టికాహార లోపం వల్లే 30 వరకు మాతా శిశు మరణాలు సంభవించాయి. నేటికీ ఐటీడీఏ పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోలేకపోయింది.
ఉపాధికి ఏదీ ఊతం?
గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టలేకపోయారు. పనుల కోసం గిరిజనులు వలస పోతున్నారు. ఏజెన్సీలో అపారమైన అవకాశాలు ఉన్నా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించలేకపోతున్నారు. గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి బయట ప్రాంతాలకు పంపిస్తున్న అక్కడ ఇమడలేక తిరిగి వస్తున్నారు. ఐటీడీఏ లెక్కల్లో మాత్రం గిరిజన యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి చూపినట్టు లెక్కలు రాసుకుంటున్నారు.
వైద్య సేవలు అంతంత మాత్రమే..
ఏజెన్సీలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యులు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు అందడం లేదు. చాపరాయి సంఘటనలో 18 వరకు గిరిజనులు జ్వరాలు బారిన పడి చనిపోతేనే గాని వైద్య సేవలపై దృష్టి పెట్టలేకపోయారు. వందల గ్రామాలను కలిపే రహదారులు ఆధ్వానంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలకు అసలు రహదారి సౌకర్యమే లేదు. కొండవాగులపై వంతెనల నిర్మాణం అవసరాన్ని గుర్తించడం లేదు.
Advertisement
Advertisement