కొబ్బరిలో కుదేలు
నేడు అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం
అమలాపురం/ అంబాజీపేట : జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సుమారు లక్ష మంది రైతులు, మూడు వేల మంది వ్యాపారులు, ఐదు వేల మంది కార్మికులు, మరో పది వేల మంది కూలీలు కొబ్బరిపై ఆధారపడి ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రెండు నెలల క్రితం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.మూడు వేల వరకు పడిపోవడంతో రికార్డు స్థాయిలో రైతులు దిగుబడి సాధించినా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం ధర రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉన్నా కొనేవారు లేక రైతులు ఇళ్ల వద్ద.. తోటల్లో.. కళ్లాల్లో వేలాదిగా కొబ్బరి నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపార కేంద్రం మన జిల్లాలోని అంబాజీపేటలో ఉంది. ఏడాదిలో ఇక్కడి కొబ్బరి వ్యాపార లావాదేవీలు రూ.400 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఇంతటి కీలకమైన కొబ్బరి పంట ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పక్కనే ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొబ్బరి రైతులకు ఆయా ప్రభుత్వాలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), పరిశోధనా కేంద్రాల నుంచి అందుతున్న సహాయ సహకారాలు... రాయితీల్లో పదో వంతు కూడా మన రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, చిత్తూరులో విస్తారంగా కొబ్బరి సాగు జరుగుతున్నందున కొబ్బరి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. అందుకు ‘పంచ’ విధానాలు అమలు చేయాలని, తమకు వాటిని ఆందుబాటులోకి తీసుకురావాలని కొబ్బరి రైతులకు కోరుతున్నారు.