వందే.. మందేశ్వరా..!
వందే.. మందేశ్వరా..!
Published Thu, Aug 17 2017 12:47 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM
రాష్ట్రంలోనే రెండో శనిక్షేత్రం వల్లూరిపల్లి
103ఏళ్ల చరిత్ర
19న శనిత్రయోదశి
ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
నేరుగా స్వామికి తైలాభిషేక అవకాశం
శనిదోషాల నివారణకు శనీశ్వరుని పూజించడం ఆనవాయితీ. శనిత్రయోదశి నాడు ఆ స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల నమ్మిక. మన జిల్లాలోనూ వల్లూరిపల్లిలో శనీశ్వరాలయం ఉందని, అది రాష్ట్రంలోనే రెండో క్షేత్రమని మీకు తెలుసా..! ఈ క్షేత్రంలో 19న శనిత్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర మహిమ గురించి ప్రత్యేక కథనం..
పెంటపాడు :
రాష్ట్రంలోనే తొలి శనీశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఉంది. రెండో ఆలయం మన జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో ఉంది. ఇక్కడి మందేశ్వరస్వామి(శనీశ్వరుడు) ఆలయానికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంభూ ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో పూజలు చేస్తే శనిదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి లింగాకర రూపంలో ఉండడం విశేషం. 1815లో నిర్మించిన ఈ ఆలయం 103 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి, మందేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, విశ్వేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రతి శనిత్రయోదశి నాడు ఇక్కడ విశేష అభిషేకాలు జరుగుతాయి. 103ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19న శనిత్రయోదశి నాడు భక్తులే స్వామిని అభిషేకించే అవకాశం ఆలయ అధికారులు కల్పిస్తున్నారు. వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు తెలిపారు.
శనిదోషాలంటే..
సూర్యుడు నుంచి కేతువు వరకు నవగ్రహాల సంచారం వల్ల కొంతమందికి గ్రహస్థితి సరిగాలేకపోవడం వల్ల విచారం, దిగులు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు సరిగా ఉండవు. వీటినే శనిదోషాలంటారు. వీటి నివారణకు శనీశ్వరుని పూజించాలని పండితులు చెబుతున్నారు. శనిదోష నివారణ పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచిందని, ఇక్కడ పూజలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు.
తైలాభిషేక ప్రియుడు
శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడని, ఆయనను నూనెతో అభిషేకిస్తే త్వరగా కరుణిస్తాడని పండితులు చెబుతున్నారు. త్రయోదశి నాడు కాలువలో స్నానం చేసి ఆ దుస్తులను అక్కడే వదిలి కొత్త వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనాలని, లింగాకారంలో ఉన్న శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం, ఇతర పూజలు చేస్తే కుటుంబంలో సుఖశాంతులు, అష్టయిశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వివరిస్తున్నారు. ఇక్కడ పూజలు చేయించుకొన్నవారు తిరిగి మొక్కులు తీర్చుకోవడం కూడా ఆనవాయితీగా మారింది. శనిత్రయోదశి నాడు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపత్యంలో అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఆలయవంశపారంపర్య ధర్మకర్త వేదుల వెంకటేశ్, ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు వీటిని పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో ఏకైక ఆలయం
జిల్లాలో ఏకైక శనీశ్వర ఆలయంగా వల్లూరిపల్లిక్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారంతో పాటు, శని త్రయోదశి రోజున జిల్లాతోపాటు, రాష్ట్రం నలుమూలల నుండి పలువురు ప్రముఖులు ఈ ఆలయానికి వస్తారు. లింగాకారంలో ఉన్న శనీశ్వరుడు ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం.
ఆలయ అర్చకులు పూజ్యం వెంకటసత్యనారాయణ శర్మ
ఇటీవల భక్తులు పెరిగారు
మా ఊరులో శనీశ్వరుని ఆలయం ఉండడం ఆనందంగా ఉంది. నాచిన్నప్పుడు కన్నా ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరిగింది. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి స్నానాలకు గదులు, వసతికి ప్రత్యేక రూములు నిర్మిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది.
దెయ్యం వెంకటేశ్వరరావు, వల్లూరిపల్లి గ్రామస్తుడు
Advertisement