క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న రవిమారుత్
ఖమ్మం స్పోర్ట్స్ : విద్యార్థులు చదువుతోపాటు ఆటలపై మక్కువ పెంచుకోవాలని హార్వెస్ట్ పాఠశాల కరస్పాండెంట్ రవిమారుత్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో నగర పాఠశాలల స్థాయి క్రీడలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. క్రీడా పతాకాన్ని ఎగురవేసి పోటీలను ప్రారంభించగా.. 25 పాఠశాలల విద్యార్థులు మార్స్‌ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిమారుత్ మాట్లాడుతూ పాఠశాలల విద్యార్థులందరూ ఒకేచోట చేరడంతో పండగ వాతావరణం నెలకొందన్నారు. క్రీడలు శారీరక, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారు చదువులో రాణించలేరనే అపోహ తొలగించుకోవాలన్నారు. డీసీఈబీ సెక్రటరీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని పాఠశాలలను సమన్వయపరుస్తూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈ పోటీలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. క్రీడల కన్వీనర్ పార్వతీరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. అనంతరం 25 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ పీఈటీ ఎల్లారెడ్డి, సెక్రటరీ బి.నాగయ్య తదితరులు పాల్గొన్నారు.