- అకాడమీలు అందుబాటులో ఉండాలి
- రాష్ట్రస్పోర్ట్సు అథారిటీ చైర్మన్ మోహన్
నిష్పక్షపాతంగా క్రీడాకారులను ఎంపిక చేయాలి
Published Sat, Oct 8 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
సామర్లకోట :
క్రీడాకారులకు అకాడమీలు అందుబాటులో ఉన్నప్పుడే ఉత్తమంగా తయారవుతారని రాష్ట్ర స్పోర్ట్సు అథారిటీ చైర్మన్ పీఆర్ మోహన్ పేర్కొన్నారు. సామర్లకోటలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా శనివారం కబడ్డీ కోర్టులను ఆయన పరిశీలించారు. కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ పల్లం బీడు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. ఆ స్థలం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి స్టేడియం నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఇస్తే దాత ఫొటోతో స్టేడియం పేరు ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రీడాకారుల ఎంపిక అవినీతి, పక్షపాతం, సిఫారసులు లేకుండా జరిగితే నిజమైన క్రీడాకారులకు అవకాశం ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో గోల్డు మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఏడు లక్షలు నగదు బహుమతి ఇవ్వడానికి నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో స్టేడియాలు లేని పరిస్థితి ఏర్పడిందని, దాంతో రూ. 70 కోట్లతో స్టేడియం నిర్మించాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు.
పదేళ్లక్రితం టోర్నమెంట్‌కు నిధులిచ్చేవారు
రాష్ట్రంలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా పదేళ్ల క్రితం ప్రతి క్రీడాకారుడికి రూ.50 వంతున నిధులు కేటాయించేవారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రం నుంచి ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు వియత్నాంలో జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలను సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సొంత ఖర్చులు, దాత సహకారంతోనే టోర్నమెంటులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ కబడ్డీ కోచ్ పోతుల సాయి, రాష్ట్ర కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల మురళీ కుమార్, కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement