Published
Mon, Aug 8 2016 11:59 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
సెంచరీ కొట్టిన శ్రీశైలం
కర్నూలు(సిటీ): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 106 టీఎంసీలకు చేరుకుంది. గత నాలుగేళ్లతో పోలిస్తే ఆగస్టు మొదటి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. గత ఏడాది కృష్ణా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడంతో నదులు జల కళ తప్పాయి. ఫలితంగా శ్రీశైలం జలాశయంలో 82.19 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఈ ఏడాది కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వరం పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి.. నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో అక్కడి నుంచి వస్తున్న భారీ వరదతో సోమవారం తెల్లవారుజాము సమయానికి శ్రీశైలం డ్యాం నీటి మట్టం 106 టీఎంసీలకు చేరుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.