కడప ఉక్కుపై ఉద్యమించాలి
కడప సెవెన్‌రోడ్స్ :
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం విద్యార్థులు ఉద్యమిస్తేనే ప్రభుత్వాల్లో చలనం వస్తుందని నగర మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాష అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, అమరావతిని ఫ్రీ జోన్‌గా చేయాలంటూ రాయలసీమ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వి.రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని మంగళవారం వారు సందర్శించి మద్దతు ప్రకటించారు. మేయర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ 1970లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతోనే విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటైందన్నారు.
ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కడప ఉక్కు అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకుడు షఫీ, చల్లా రాజశేఖర్, ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వి.రవిశంకర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి, ముక్తియార్ విద్యా సంస్థలు, నారాయణ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.