ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
-
జేసీ ఇంతియాజ్
వరికుంటపాడు : ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా సాగుచేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జేసీ ఇంతియాజ్ హెచ్చరించారు. వరికుంటపాడు తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం భూసమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి మెట్ట మండలాల్లో కొంతమంది అక్రమార్కులు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి సాగుచేసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ బైండోవర్ చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఉదయగిరి ప్రాంతం నుంచి భూసమస్యలపై జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు ఎక్కువ అర్జీలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీల వెల్లువ
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు భూసమస్యలపై అర్జీలు వెల్లువలా వచ్చాయి. భూ ఆక్రమణలకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా బాధితులు ఇచ్చారు. తూర్పురొంపిదొడ్ల, డక్కునూరు, టి.కొండారెడ్డిపల్లి, వేంపాడు, తూర్పుబోయమడుగుల, మహ్మదాపురం, పెద్దిరెడ్డిపల్లి, జి.కొండారెడ్డిపల్లి, కాంచెరువు తదితర గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని జేసీకి అర్జీలిచ్చారు. కార్యక్రమంలో కావలి ఆర్డీవో లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఓపీ రిజిష్టరు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు.