కాలర్‌పట్టి కొట్లాడితేనే వర్గీకరణ
Published Sat, Sep 24 2016 11:44 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
వనపర్తిటౌన్: ‘ఢిల్లీలో వెంకయ్యనాయుడి కాళ్లు మొక్కితే ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు..కాలర్ పట్టి కొట్లాడితేనే సాధ్యమవుతుంది’ అంటూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై పరోక్షంగా ధ్వజమెత్తారు. శనివారం వనపర్తి పట్టణంలోని యాదవ భవనంలో వనపర్తి జిల్లా పేరిట జరిగిన వనపర్తి, గద్వాల, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాల ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఆంధ్ర వాళ్లను తెలంగాణలో ఉండనీయరని ప్రచారం చేస్తే అవాస్తమని తెలినట్లే ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలు కలిసిమెలసి ఉంటారని ఆచరణలో తేలుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదని, సామాజిక న్యాయంలో అదో భాగమన్నారు. మాదిగ జాతిలో డక్కలి, బుడగ జంగాలు తదితర ఉప కులాలకు సమన్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ ఏకైక మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెడితే మాల కులస్థులు సైతం మద్దతిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేయించిన తీర్మానం నిలబడేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వర్గీకరణపై అడుగులు కదుపుతోందని,, ప్రస్తుత తరుణంలో అందరం ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. 27 జిల్లాలో మాదిగ జేఏసీ పటిష్టం చేయనున్నట్లు వివరించారు. కాళ్లు మొక్కే బానిసలకు మాదిగ జేఏసీలో స్థానం లేదని చెప్పారు. 2001లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 14 ఏళ్లలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని, 1994లో ప్రారంభభమైన వర్గీకరణ ఉద్యమం 20ఏళ్లలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. ఓ నేత రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పనికొస్తున్నదని మండిపడ్డారు. ఆయన అంబేద్కర్ వారసుడనని చెప్పుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ ప్రతినిధులు గోపాల్, కిరణ్‌కుమార్,దొడ్ల రాములు, డీఎం రాములు, రవి, కృష్ణమోహన్ ప్రశాంత్, బాలస్వామి, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement