విద్యారంగం అభివృద్ధికి ఉద్యమాలే మార్గం
Published Wed, Aug 24 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : విద్యారంగం అభివృద్ధి చెంది అందరికీ సమానమైన విద్య అందాలంటే విద్యార్థి ఉద్యమాలే మార్గమని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. బుధవారం కళాభారతిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విసృతస్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని, విశ్వవిద్యాలయాల్లో కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ విద్యార్థులను బలిగొంటున్నారని అన్నారు. బాలికలకూ మూత్రశాలలు లేని పరిస్థితి ఉండడం దౌర్భాగ్యమన్నారు. నేటి విద్యావిధానం ప్రశ్నకు సమాధానాలు అన్న తరహాలో కొనసాగుతోందని, ఇలాగైతే మేథావులు ఎలా తయారవుతారని ప్రశ్నించారు. రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, చదువులు, కొలువులు వస్తాయని ఆశించిన యువతకు నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి, యువజన సంఘాలను లాఠీలు, తూటాలతో అణిచివేయడం అనైతికమన్నారు. విద్యార్థులు ఐక్యతచాటుతూ.. ఉద్యమించే హక్కులను కాపాడుకోవాలని అన్నారు. తనకు ఎస్‌ఎఫ్‌ఐతో 20 ఏళ్ల అనుబంధముందన్నారు. ఇలాంటి సెమినార్లు మరిన్ని నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యంకలిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ముద్దసాని రమేశ్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ఉపాధ్యక్షురాలు రజిని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదం తిరుపతి, బత్తిని సంతోష్, రజినీకాంత్, లక్ష్మణ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement