ట్రాక్టర్ ఢీకొని విద్యార్థిని మృతి
ట్రాక్టర్ ఢీకొని విద్యార్థిని మృతి
Published Thu, Jul 28 2016 8:07 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
నగరం : రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం నగరం శివారు నల్లకాల్వ వంతెన సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు మండలంలోని పెదమట్లపూడి గ్రామానికి చెందిన లుక్కా గాయత్రి (13) ముత్తుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పాఠశాలలో గురువారం యూనిట్ పరీక్షలు రాసి పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నగరం బయలుదేరింది. మార్గమధ్యంలో నల్లకాల్వ వంతెన సమీపంలోకి రాగానే సైకిల్‌పై వెళుతున్న గాయత్రిని వెనుక నుంచి ఇసుకలోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో కిందపడింది. వెంటనే ట్రాక్టర్ ఆమె పైకి ఎక్కడంతో తీవ్ర గాయాలపాలైంది. గాయత్రిని స్థానికులు నగరం పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.అశోక్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయత్రి మృతదేహానికి శవ పంచనామా జరిపి పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. విద్యార్థిని తండ్రి గుడారంకయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు.
కన్నీటి పర్యంతమైన గాయత్రి తల్లిదండ్రులు
పాఠశాలకు వెళ్లిన కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని సమాచారం తెలుసుకున్న గాయత్రి తండ్రి గుడారంకయ్య, సుమతి, బంధువులు హుటాహుటిన నగరం పీహెచ్‌సీకి చేరుకున్నారు. విగతజీవురాలైన కుమార్తె చూసి కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. గుడారంకయ్యకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో గాయత్రి చిన్న కుమార్తె కావడంతో గారాబంగా చూసుకుంటున్నారు. గాయత్రి మృతితో లుక్కావారిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement