ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
పిట్టలవానిపాలెం: ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణను శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థలం తనఖా రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సిహెచ్.డి.శాంతో, సీఐ నరసింహారెడ్డి కథనం మేరకు... నిజాంపట్నం గ్రామానికి చెందిన చెన్ను నాగేశ్వరరావు కుమారుడు చెన్ను విజయరామరాజుకు బాపట్లలోని తమిళనాడు మర్కంటేల్ బ్యాంకులో ఇంటి నిర్మాణం కోసం రుణం మంజూరు చేశారు. ఇంటి స్థలం తనఖా రిజిస్ట్రేషన్ చేయాలని విజయరామరాజు ఈ నెల 26 వతేదీన సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణను కలిసి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇంటి విలువ రూ.7 లక్షలు ఉంది. తనఖా రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.4,300 చలానా తీయాలని, అవి కాకుండా రూ.లక్షకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.7వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డమాండ్ చేశారు.Sరూ.5 వేలు ఇస్తానని రిజిస్ట్రార్‌తో విజయరామరాజు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని విజయరామరాజు అదే రోజు గుంటూరులోని ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. శనివారం సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు రూ.5వేలు లంచం ఇచ్చిన వెంటనే సమీంలో పొంచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదు స్వాధీనం చేసుకుని సబ్‌రిజిస్ట్రార్‡ లక్ష్మీనారాయణ చేతులను కడిగారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శాంతో విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ రకాల పనుల నిమిత్తం అధికారులు ఎవరైనా లంచం డిమాండు చేస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.
తట్టుకోలేకే ఇలా చేశాను..
పేదప్రజలను లంచాల కోసం పీడించడం ఎంత వరకు న్యాయం. రూ.7 లక్షల విలువైన ఇంటి స్థలం తనఖా రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.లక్షకు రూ.1,000 లంచం ఇవ్వాల్సిందేనని లేకపోతే చేసేది లేదని స్వయంగా సబ్‌రిజిస్ట్రార్ డిమాండు చేశాడు.
బాధితుడు చెన్ను విజయరామరాజు